Asia Cup: ఆసియా కప్ - 2023లో భారత జట్టు పాకిస్తాన్ కు రాకపోవడానికి భద్రతా కారణాలు ఒక సాకు మాత్రమేనని, అసలు కారణం వాళ్లు ఓడిపోతామనే భయమేనని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆసియా కప్ వివాదం సద్దుమణుగుతుందని అనుకుంటున్న తరుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీ పాకిస్తాన్ లోనే జరుగుతుండగా భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం తటస్థ వేదికల మీద నిర్వహించడానికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. అయితే నజీర్ మాత్రం.. భారత జట్టు పాకిస్తాన్ కు రాకపోవడానికి భద్రతా కారణాలను చూపిస్తున్నదని.. అసలు వాస్తవం మాత్రం వాళ్లు ఓడిపోతామనే భయమేనంటూ అవాకులు చెవాకులు పేలాడు.
పాకిస్తాన్ లో ప్రముఖ యూట్యూబర్ నాదిర్ అలీ పోడ్‌కాస్ట్ లో ఇమ్రాన్ నజీర్ మాట్లాడుతూ... ‘భద్రతా కారణాలు లేనే లేవు. పాకిస్తాన్ కు ఎన్ని టీమ్ లు వస్తున్నాయో చూడండి. చిన్న చిన్న టీమ్ ల గురించి వదిలేయండి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి టీమ్ లు కూడా పాక్ కు వస్తున్నాయి...
అసలు వాస్తవం ఏమిటంటే భారత్ కు పాకిస్తాన్ కు వచ్చి క్రికెట్ ఆడితే ఇక్కడ ఆడితే ఓడిపోతామని భయం. భద్రతా కారణాలు ఒక సాకు మాత్రమే. ఇక్కడకు వచ్చి క్రికెట్ ఆడండి. అప్పుడేగా అసలు విషయాలు తెలుస్తాయి. భారత్ - పాక్ మ్యాచ్ అంటే ఇరుదేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. దానిని ఆస్వాదించాలి. కానీ టీమిండియాకు ఓటమిని తట్టుకునే శక్తి లేదు. ఆటలో గెలుపోటములు సహజం...’ అని చిలుకపలుకులు పలికాడు.
కాగా నజీర్ కు సోషల్ మీడియా వేదికగా భారత క్రికెట్ అభిమానులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్తాన్ లో ప్రధానుల భద్రతకే దిక్కులేదని, అలాంటిది క్రికెటర్ల సంగతి వేరే చెప్పాలా..? అని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై బాంబు దాడి, ఇతర ఘటనలను ప్రస్తావిస్తున్నారు. గతంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లు పాకిస్తాన్ తో సిరీస్ లను క్యాన్సిల్ చేసుకున్నవిషయాలు మరిచిపోవద్దని నజీర్ కు సూచిస్తున్నారు. ఒకటి రెండు మ్యాచ్ లు గెలిచినంత మాత్రానా పాకిస్తాన్ తోపు టీమ్ అనుకోవద్దని.. మాట్లాడే ముందు కాస్త చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
కాగా ఆసియా కప్ నిర్వహణపై బీసీసీఐ, పీసీబీలు గత కొంతకాలంగా కత్తులు దూసుకుంటున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ లో ఆసియాకప్ ఆడేందుకు భారత్ వెళ్లబోదని, తటస్థ వేదిక అయితేనే ఆడతామని బీసీసీఐ సెక్రటరీ జై షా చేసిన వ్యాఖ్యలతో రేగిన దుమారం ఇన్నాళ్లు రగులుతూనే ఉంది. ఎట్టకేలకు ఇరుదేశాల క్రికెట్ బోర్డులతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) గురువారం దుబాయ్ లో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో బీసీసీఐ ప్రతినిధులతో పాటు పీసీబీ వాదనలూ వింది. మొదట్నుంచి చెబుతున్న మాటనే బీసీసీఐ మరోసారి తెలిపింది. తటస్థ వేదిక అయితే తప్ప ఈ టోర్నీలో ఆడబోమని తేల్చి చెప్పింది. పీసీబీ అందుకు అంగీకరించలేదు. దీంతో ఏసీసీ జోక్యం చేసుకుని ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహించేందుకు ఆమోదం తెలుపుతూనే భారత్ ఆడబోయే మ్యాచ్ లను మాత్రం తటస్థ వేదికలపై నిర్వహించాలని సూచించింది.
దీని ప్రకారం.. ఆసియా కప్ పాకిస్తాన్ లోనే జరుగుతుంది. కానీ ఈ లీగ్ లో భారత్ ఆడబోయే మ్యాచ్ లు మాత్రం మరో దేశంలో జరుగాయి. ఈ ప్రతిపాదనకు పీసీబీ కూడా అంగీకారం తెలిపింది.
