CWC 2022: రెండు వార్మప్ మ్యాచుల్లో విజయాలు అందుకున్న భారత మహిళా జట్టు... మార్చి 6న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న మిథాలీ సేన...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ నాటి సంగతి. వార్మప్ మ్యాచుల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లపై ఘన విజయాలు అందుకుంది.. అయితే టోర్నీ మొదలయ్యాకే సీన్ రివర్స్ అయ్యింది...

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత జట్టు, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా భారత మహిళా జట్టు కూడా వార్మప్ మ్యాచుల్లో దుమ్మురేపింది. తొలి వార్మప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియా వుమెన్స్, రెండో వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 81 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది...

తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్స్ జట్టు, 50 ఓవర్లలో 258 పరుగులకి ఆలౌట్ అయ్యింది. గత మ్యాచ్‌లో గాయపడి రిటైర్ హర్ట్‌గా పెవిలియన్ చేరిన స్మృతి మంధాన 67 బంతుల్లో 7 ఫోర్లతో 66 పరుగులు చేసి అవుటైంది...

యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ షెఫాలీ వర్మ డకౌట్ కాగా దీప్తి శర్మ 64 బంతుల్లో ఓ ఫోర్‌తో 51 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 42 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసింది. యషికా భాటియా 53 బంతుల్లో 5 ఫోర్లతో 42 పరుగులు చేయగా రిచా ఘోష్ 13, స్నేహ్ రాణా 14 పరుగులు చేశారు...

జులన్ గోస్వామి 1 పరుగు, మేఘనా సింగ్ 3 పరుగులు చేసి అవుట్ కాగా పూనమ్ యాదవ్ 14, రాజేశ్వరి గైక్వాడ్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 259 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన వెస్టిండీస్ మహిళా జట్టు, 50 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 177 పరుగులు మాత్రమే చేయగలిగింది...

డియాండ్రా డాటిన్ 15 బంతులాడి 1 పరుగు చేసి అవుట్ కాగా అలియా అలెన్ 12, కెసియా నైట్ 23, కెప్టెన్ స్టఫనీ టేలర్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. హేలీ మాథ్యూస్ 61 బంతుల్లో 3 ఫోర్లతో 44 పరుగులు, సెమనీ చంబెల్లే 81 బంతుల్లో 6 ఫోర్లతో 63 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన విండీస్, విజయానికి చేరువగా రాలేకపోయింది...

టోర్నీలో భారత మహిళా జట్టు కూడా మొట్టమొదటి మ్యాచ్‌ పాకిస్తాన్ మహిళా జట్టుతో ఆడబోతుండడం కొసమెరుపు. మార్చి 6న పాకిస్తాన్, భారత్ మధ్య వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో తొలి మ్యాచ్ జరగనుంది. తొలి వార్మప్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత బ్యాటర్ స్మృతి మంధాన హెల్మెట్‌కి బౌన్సర్ బలంగా తగిలింది. ఫిజియో పర్యవేక్షణ తర్వాత స్మృతి, రిటైర్ హర్ట్‌గా పెవిలియన్ చేరింది...

స్మృతి మంధాన గాయానికి స్కానింగ్ నిర్వహించిన వైద్యులు, రిపోర్టులు నార్మల్‌గా రావడంతో వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాల్గొనేందుకు అనుమతించారు. వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 4-1 తేడాతో ఓడింది భారత జట్టు. అయితే ఆఖరి వన్డేలో గెలిచిన తర్వాత వరుసగా రెండు వార్మప్ మ్యాచుల్లోనూ విజయాలు అందుకోగలిగింది...