AUSWvsINDW: భారత మహిళల క్రికెట్ జట్టు సంచలన విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి టీ20 ఓడిన భారత జట్టు.. రెండో మ్యాచ్ లో మాత్రం అదరగొట్టింది.
భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు టీమిండియా అసలైన ఆటను చూపించింది. తమ ముందు భారీ లక్ష్యం నిలిపినా పోరాడింది. ఆస్ట్రేలియా నిలపిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మ్యాచ్ టై అయినా సూపర్ ఓవర్ ద్వారా తేలిన ఫలితం భారత్ కే అనుకూలంగా వచ్చింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 187 పరుగులు చేసింది. భారత్ కూడా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ కు 47వేల మంది ప్రేక్షకులు హాజరుకావడం విశేషం.
ముంబై లోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో టీ20లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్, ఓపెనర్ హీలీ (25) త్వరగానే నిష్క్రమించినా మూనీ (54 బంతుల్లో 82 నాటౌట్, 13 ఫోర్లు), తహిలా మెక్‌గ్రాత్ (51 బంతుల్లో 70 నాటౌట్, 10 ఫోర్లు, 1 సిక్స్) లు ధాటిగా ఆడారు.
లక్ష్య ఛేదనలో భారత్ కూడా అదే జోరు చూపించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన.. 49 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు చేసింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ.. 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 34 పరుగులుచేసింది. తొలి వికెట్ కు ఈ ఇద్దరూ 76 పరుగులు జోడించారు. షఫాలీ నిష్క్రమించాక భారత్ వెంటవెంటే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
జెమీమా రోడ్రిగ్స్ (4), హర్మన్‌ప్రీత్ కౌర్ (21), స్మృతిలు పెవిలియన్ చేరారు. దీప్తి శర్మ (2) కూడా నిష్క్రమించడంతో భారత్ ఈ మ్యాచ్ లో గెలుస్తుందా..? అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వికెట్ కీపర్ రిచాఘోష్.. 13 బంతుల్లోనే 3 భారీ సిక్సర్లు బాది 26 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. చివరి ఓవర్లో భారత విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికి రిచా ఘోష్ సింగిల్ తీసింది. రెండో బంతికి దేవిక వైద్య (5 బంతుల్లో 11 నాటౌట్) ఫోర్ కొట్టింది. మూడో బాల్ కు సింగిల్. నాలుగో బంతికి రెండు పరుగులు. ఐదో బంతికి సింగిల్. చివరి బంతికి ఐదు పరుగులు అవసరం కాగా వైద్య ఫోర్ కొట్టింది. మ్యాచ్ టై అయింది.
సూపర్ ఓవర్ సాగిందిలా..
సూపర్ ఓవర్ లో భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. గ్రాహమ్ వేసిన ఆ ఓవర్లో రిచా.. తొలి బంతికి సిక్సర్ బాదింది. రెండో బంతికి రిచా ఔట్. మూడో బంతికి హర్మన్ సింగిల్ తీసింది. తర్వాత రెండు బంతుల్లో మంధాన ఫోర్, సిక్సర్ కొట్టింది. చివరి బంతికి మూడు పరుగులు. దీంతో భారత్ 20 పరుగులు చేసింది.
ఆ తర్వాత రేణుకా సింగ్ బౌలింగ్. ఆసీస్ ఇన్నింగ్స్ లో హీలీ తొలి బంతికి ఫోర్.. రెండో బంతికి సింగిల్. మూడో బంతికి గార్డ్‌నర్ ఔట్. నాలుగో బంతికి మెక్‌గ్రాత్ సింగిల్. ఐదో బంతికి ఫోర్, ఆరో బంతికి సిక్స్. 21 పరుగులు చేయాల్సి ఉండగా ఆస్ట్రేలియా 16 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. కాగా ఈ ఏడాది ఆస్ట్రేలియాకు టీ20లలో ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో మూడో టీ20 ఈనెల 14న బ్రబోర్న్ స్టేడియంలో జరుగనుంది.
