ముంబై: వెస్టిండీస్ పై బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచులో భారత బ్యాట్స్ మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వెస్టిండీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఆ కారణంతో మూడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. భారత్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ చతికిలబడ్డారు. 

ఈ మ్యాచులో భారత ఆటగాళ్లు రికార్డుల మోత మోగించగా, వెస్టిండీస్ చెత్త రికార్డును మూట గట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న రెండో క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (19), విరాట్ కోహ్లీ (15), దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వసల్ కలిస్ (14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 

స్వదేశంలో జరిగిన ట్వంటీ20 మ్యాచుల్లో వేయి పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్ గా కూడా విరాట్ కోహ్లీ నిలిచాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో అతను సమంగా నిలిచాడు. వారిద్దరు కూడా 2,633 పరుగులు చేశారు. 

అంతర్జాతీయ క్రికెట్ లో 400 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. అత్యంధకి సిక్సర్లు బాదిన ప్రపంచ క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్ గేల్ (534) మొదటి స్థానంలో నిలువగా, షాహిద్ అఫ్రిదీ (476) రెండో స్థానంలో నిలిచాడు. 

ఒక టీ20 మ్యాచులో ముగ్గురు ఆటగాళ్లు 70, అంతకన్నా ఎక్కువ పరుగులు సాధించడం కూడా ఇదే తొలిసారి. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఆ ఘనత సాధించారు. టీ20లో టీమిండియా ఓపెనర్లు ఇద్దరు అర్థ సెంచరీలు చేయడం ఇది ఐదోసారి. 

టీ20ల్లో భారత్ కు ఇది మూడో అత్యుత్తమ స్కోరు. వెస్టిండీస్ పై జరిగిన ఈ మ్యాచులో భారత్ 240 పరుగులు చేసింది. 2017లో శ్రీలంకపై భారత్ 260 పరుగులు చేసింది. ఇది అత్యధిక స్కోరు. 

అన్ని ఫార్మాట్లలో కలిసి భారత్ చేతిలో వెస్టిండీస్ వరుసగా ఏడు సిరీసులను కోల్పోయింది. 2018లో జరిగిన టెస్ట్ సిరీస్ నుంచి ప్రారంభిస్తే టీమిండియాపై వెస్టిండీస్ పరాజయాల పరంపర కొనసాగతూ వస్తోంది.

ముంబైలో జరిగిన మూడో టీ20 మ్యాచులో ఓటమి ద్వారా వెస్టిండీస్ చెత్త రికార్డు నమోదు చేసుకుంది. టీ20ల్లో అత్యధిక పరాజయాలను చూసిన జట్టుగా వెస్టిండీస్ శ్రీలంకతో సమంగా నిలిచింది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 61 సార్లు ఓటమి పాలయ్యాయి.