2020 టీ20 ప్రపంచకప్‌ సన్నాహకం ముంగిట ధనాధన్‌ సమరానికి హైదరాబాద్‌ వేదిక కానుంది. మరో ఏడాదిలో  రానున్న టి 20 వరల్డ్ కప్ నేపథ్యంలో భారత్‌ సహా వెస్టిండీస్‌ కప్పుపై ఓ కన్నేసి సాధన చేస్తున్నాయి. 

జట్టు కూర్పు, విభిన్న పరిస్థితులల్లో ఒత్తిడిని తట్టుకుని నిలబడే ఆటగాళ్ల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ తరుణంలో భారత్‌, వెస్టిండీస్‌ మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. 

భారత్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టుపై ఇంకా ఓ స్పష్టతకు రావాల్సి ఉంది. మరో వైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2020 టీ20 ప్రపంచకప్‌ జట్టు ఎంపిక కోణంలో ఈ పొట్టి సవాల్‌ కీలకంగా మారింది. నేడు ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్‌, వెస్టిండీస్‌లో తొలి పరీక్ష ఎదుర్కొనున్నాయి. పరుగుల వరద పారనుందనే అంచనాలతో నేడు రాత్రి 7 గంటలకు ధనాధన్‌ దంచుడు మొదలు!.

ఫోకస్ చేయాల్సింది వీరిపైనే... 

భారత్‌ 2020 టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమవుతోంది. ఈ సమయంలో సహజంగానే ఫోకస్‌ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు ఆశిస్తున్నా వారిపైనే నెలకొంటుంది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన సంజు శాంసన్‌ ఓ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. 

Also read: భారత్-విండీస్ మ్యాచ్‌లో కొత్త రూల్: ఆయన చెప్పినట్లు ఫీల్డ్ అంపైర్లు చేయాల్సిందే

కానీ కెఎల్‌ రాహుల్‌ను కాదని ఓపెనర్‌గా శాంసన్‌ను ఎంచుకునే వాతావరణం కనిపించటం లేదు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన మనీశ్‌ పాండే ఐపీఎల్‌ సొంత మైదానంలో చెలరేగాలని చూస్తున్నాడు. ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న మనీశ్‌ పాండే జాతీయ జట్టు తరఫున అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. 

స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ సైతం వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్నాడు. ఇప్పుడిప్పుడే డ్రెస్సింగ్‌రూమ్‌లో నాయకుల నుంచి పంత్‌కు మద్దతు లభిస్తోంది. విమర్శలు ఎదుర్కొంటున్న కాలంలో పంత్‌ ఫటాఫట్‌ ప్రదర్శన కోసం చూస్తున్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో ప్రధానంగా వీరిపై ఫోకస్‌ కనిపిస్తోంది.

బుమ్రా లేని వేళ టీ20 జట్టులో నేనింకా కీలకమే అని నిరూపించుకునేందుకు భువనేశ్వర్‌ కుమార్‌కు ఓ అవకాశం. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున భువి ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేశాడు. 

మహ్మద్‌ షమితో కలిసి భువి పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. దీపక్‌ చాహర్‌ వికెట్ల వేట తిరిగి ప్రారంభించనున్నాడు. చాహల్‌తో పాటు రవీంద్ర జడేజా తుది జట్టులో చోటు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది!. 

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా శ్రేయాష్‌ అయ్యర్‌ టాప్‌ ఆర్డర్‌లో టాప్‌ ఫామ్‌లో ఉన్నారు. లక్ష్యం నిర్దేశించినా, లక్ష్యాన్ని ఛేదించినా ఈ ముగ్గురు భారత్‌కు కీలకం కానున్నారు.

కరీబియన్ యంగ్ గన్స్... 

టీ20 ప్రపంచకప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) ముగించుకున్న వెస్టిండీస్‌ ఆటగాళ్లు టీ20 టచ్‌లో ఉన్నారు. 

విధ్వంసక ఆటగాళ్లు క్రిస్‌ గేల్‌, అండ్రీ రసెల్‌, కార్లోస్‌ బ్రాత్‌వేట్‌ సేవలు విండీస్‌కు అందుబాటులో లేవు. అయినా కీరన్‌ పొలార్డ్‌ సారథ్యంలో టీమ్‌ ఇండియాకు షాక్‌ ఇచ్చేందుకు విండీస్‌ సిద్ధమవుతోంది. 

షిమ్రోన్‌ హెట్‌మయర్‌, ఫబియన్‌ అలెన్‌, హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌, బ్రాండన్‌ కింగ్‌ తామేంటో నిరూపించుకునే పనిలో ఉన్నారు. సీపీఎల్‌లో బ్రాండన్‌ కింగ్‌ అత్యధిక పరుగుల వీరుడు. సీనియర్‌ ఆటగాడు లెండ్లి సిమోన్స్‌ రాక విండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను బలోపేతం చేస్తుంది. 

కెప్టెన్‌ పొలార్డ్‌ ధనాధన్‌ విన్యాసాలు అదనపు హంగు. వికెట్‌ కీపర్‌ నికోలస్‌ పూరన్‌ నిషేధం కారణంగా నేడు మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. దీంతో దినేశ్‌ రామ్‌దిన్‌ వికెట్ల వెనకాల బాధ్యత నిర్వర్తించనున్నాడు. 

Also read: India vs West Indies:టి20 వరల్డ్ కప్ బెర్తుల కోసం ఉత్కంఠ... పోటీ భారత ఆటగాళ్ల మధ్యే

కీపర్‌గా రామ్‌దిన్‌కు పేరు పెట్టేది లేదు, కానీ బ్యాట్‌తో రామ్‌దిన్‌ పరుగులు సాధించటంపై అనుమానాలు ఉన్నాయి. కీమో పాల్‌, జేసన్‌ హౌల్డర్‌, షెల్డన్‌ కాట్రెల్‌, హెడెన్‌ వాల్ష్‌లతో కూడిన బౌలింగ్‌ బృందం సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

400 క్లబ్ లో చేరేందుకు రోహిత్ శర్మ ఉవ్విళ్ళు... 

అంతర్జాతీయ క్రికెట్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచేందుకు రోహిత్‌ శర్మ ఓ సిక్సర్‌ దూరంలో ఉన్నాడు. రోహిత్‌ శర్మ 399 సిక్సర్లు బాదాడు. క్రిస్‌ గేల్‌ (534), షాహిద్‌ ఆఫ్రిది (476) సిక్సర్ల రేసులో రోహిత్‌ శర్మ కంటే ముందున్నారు.

పిచ్‌ రిపోర్టు... 

వర్షం సూచనలతో మ్యాచ్‌కు రెండు రోజుల ముందు పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. మ్యాచ్‌ రోజు మంచి ఎండ కాయనుంది. సాయంత్రం శీతల వాతావరణం ఉండనుంది. ఐపీఎల్‌లో హైదరాబాద్‌ అనగానే బౌలర్ల అడ్డా. 

సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ బృందం ఉప్పల్‌లో అద్భుతాలు చేసింది. తక్కువ స్కోర్ల మ్యాచులు ఉత్కంఠ రేపాయి. భారత్‌, వెస్టిండీస్‌ మ్యాచ్‌కు బ్యాటింగ్‌ పిచ్‌ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయినా, ఇక్కడ సీమర్లు, స్పిన్నర్లకు మంచి అవకాశం ఉండనే ఉంటుంది. 

టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే వీలుంది. మ్యాచ్‌కు ఎటువంటి వర్ష సూచనలు లేకపోయినా.. రాత్రి వేళ గాలి నాణ్యత ఆందోళకరంగా ఉండనుందని వాతావరణ శాఖ చెబుతోంది.  

జట్ల కూర్పు (అంచనా).. 

భారత్‌ : రోహిత్‌ శర్మ, కెఎల్‌ రాహుల్‌/ సంజూ శాంసన్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయాష్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషబ్‌ పంత్‌, శివం దూబె, రవీంద్ర జడేజా, యుజ్వెంద్ర చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌.

వెస్టిండీస్‌ : ఎవిన్‌ లెవిస్‌, లెండ్లి సిమోన్స్‌, బ్రెండన్‌ కింగ్‌, షిమ్రోన్‌ హెట్‌మయర్‌, కీరన్‌ పొలార్డ్‌, దినేశ్‌ రామ్‌దిన్‌, జేసన్‌ హౌల్డర్‌, కీమో పాల్‌, ఫబియన్‌ అలెన్‌, హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌, షెల్డన్‌ కాట్రెల్‌.