వెస్టిండిస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో టీమిండియాకు చెందిన కీలకమైన ఆటగాళ్లను పక్కనబెట్టారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లను రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేయడాన్ని మాజీలు తప్పుబడుతున్నారు. టెస్ట్ సీరిలో రోహిత్ శర్మను ఆడించాలని వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ వంటివారే కాకుండా షోయబ్ అక్తర్ వంటి విదేశీ సీనియర్లు సైతం టీమిండియా మేనేజ్ మెంట్ కు సూచించారు. తాజాగా మరో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపర్చాడు. 

''భారత జట్టులో కీలక ఆటగాళ్లయిన రోహిత్, అశ్విన్ లకు ఫస్ట్ టెస్ట్ ఆడే అవకాశం రాకపోవడం ఆశ్చర్యంగా వుంది. వారి సేవలను ఉపయోగించుకోకపోవడం వల్ల టీమిండియా నష్టపోయే అవకాశాలున్నాయి. ముఖ్యంగా విండీస్ పై మంచి ట్రాక్ రికార్డున్న స్పిన్నర్ అశ్విన్ కు కూడా తుది జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యంగా వుంది.'' అంటూ గవాస్కర్ టీమిండియా నిర్ణయాన్ని తప్పుబట్టాడు. 

అయితే మొదటి రోజు ఆట ముగిసిన అనంతరం వైస్ కెప్టెన్ అజింక్యా రహానే మీడియాతో మాట్లాడుతూ గవాస్కర్ వ్యాఖ్యలపై స్పందించాడు. రోహిత్, అశ్విన్ లను ఎందుకు పక్కనబెట్టాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు. '' జట్టు ప్రయోజనాలకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. రవీంద్ర జడేజా, హనుమ విహారీలు బ్యాటింగ్ తో పాటు పార్ట్ టైమ్ బౌలర్లుగా  ఉపయోగపడగలరు. కాబట్టి సీనియర్లు  రోహిత్, అశ్విన్ లను పక్కనబెట్టాం. ఇది కఠినమైన  నిర్ణయమే అయినా జట్టుకోసం తప్పలేదు.'' అని రహానే అన్నాడు. 

అయితే రహానే సమాధానంపై అభిమానులు మండిపడుతున్నారు. స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్  గా రోహిత్ పక్కనబెట్టడం ఓకే...కానీ మరి ఆల్ రౌండర్ గా ఉపయోగపడే అశ్విన్ కు అవకాశమివ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. విండీస్ పై  కేవలం 11 టెస్టుల్లో 60 వికెట్లు తీసి, 552 పరుగులు చేసిన అతడి అద్భుత ట్రాక్ రికార్డుకు గుర్తింపు లేదా అంటూ విరుచుకుపడుతున్నారు. 

వెస్టిండిస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మొదటిరోజు ఆట ముగిసేసరికి టీమిండియాదే పైచేయిగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ సేన 203/6 పరుగుల వద్ద మొదటిరోజు ఆట ముగించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(5 పరుగులు),చటేశ్వర్ పుజారా(2 పరుగులు), కెప్టెన్ విరాట్ కోహ్లీ(9 పరుగులు) తో నిరాశపర్చినా రహానే 81 పరుగులు, రాహుల్ 44, విహారీ 32 పరుగులతో రాణించారు. దీంతో మొదటిరోజు భారత్ 203/6 గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.