వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే టీ20, వన్డే సీరీసుల్లో ఆతిథ్య జట్టును మట్టికరిపించిన కోహ్లీ సేన టెస్ట్ సీరిస్ లోనూ అదే ఆటతీరు కనబరుస్తోంది. ఆంటిగ్వా వేదికన జరుగుతున్న మొదటి టెస్ట్ లోనూ కోహ్లీసేన అదరగొడుతోంది. తొలిరెండు రోజులు సాగిన భారత్ హవా మూడో రోజు కూడా  కొనసాగింది. 

మొదటి ఇన్నింగ్స్ లో విండీస్ ను కేవలం 222 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇలా మూడోరోజు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కేవలం 81 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇలా మెళ్లిగా కష్టాల్లోకి జారుకుంటున్న జట్టును కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే అద్భుత హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో మూడో రోజు మ్యాచ్ లో కూడా భారత ఆధిపత్యమే కొనసాగింది. 

ఆట ముగిసే సమయానికి భారత జట్టు 185/3 స్కోరు వద్ద నిలిచింది.  కోహ్లీ 51 పరుగులు, రహానే 53 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.  అంతకుముందు కెఎల్ రాహుల్ (38 పరుగులు), చటేశ్వర్ పుజారా(25 పరుగులు), అగర్వాల్(16 పరుగులు) ల రూపంలో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. 

మొదటి టెస్ట్ లో మూడోరోజు ఆట ముగిసేసరికి వెస్టిండిస్ పై భారత్ 260 ఆధిక్యాన్ని సాధించింది. నాలుగోరోజు బ్యాటింగ్ కొనసాగించి మరిన్ని పరుగులు జోడించడం ద్వారా విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని వుంచనుంది. ఇలా విండీస్ ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టడం ద్వారా టీమిండియా విజయం సాధ్యంకానుంది. 

సంబంధిత వార్తలు

భారత్-వెస్టిండిస్ ఫస్ట్ టెస్ట్: ఆదుకున్న రహానే, రాహుల్...మొదటిరోజు టీమిండియాదే