వెస్టిండిస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మొదటిరోజే రసవత్తరంగా సాగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండిస్ బౌలర్లు ఆరంభంలో  టీమిండియా టాప్ ఆర్డర్ ను బెంబేలెత్తించారు.  అయితే చివరకు మొదటిరోజు ఆట ముగిసేసరికి మాత్రం టీమిండియాదే పైచేయిగా నిలిచింది. వెస్టిండిస్ పై పైచేయి సాధిస్తూ భారత జట్టు 203/6 పరుగుల వద్ద మొదటిరోజు ఆట ముగించింది.

ఆంటిగ్వా వేదికన జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ ఆరంభంలో విండీస్ బౌలర్ రోచ్ చెలరేగాడు. ఒకేఓవర్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(5 పరుగులు),చటేశ్వర్ పుజారా(2 పరుగులు)లను పెవిలియన్ కు పంపించాడు. దీంతో భారత్ కేవలం 7 పరుగులకే  కీలకమైన రెండు టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. 

ఆ తర్వాత బరిలోకి దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ గ్యాబ్రియెల్ అతడి ప్రయత్నాన్ని అడ్డుకుని టీమిండియాపై మరో దెబ్బేశాడు. పుజారా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(9 పరుగులు) ఎక్కువసేపు క్రీజులో నిలవలేడు.  గ్యాబ్రియెల్ ఓ అద్భుతమైన బంతితో అతన్ని బోల్తాకొట్టించి పెవిలియన్ కు పంపించాడు. దీంతో 25 పరుగుల వద్ద  టీమిండియా మూడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ తర్వాత ఓపెనర్ కెఎల్ రాహుల్,రహానేలు నిలకడగా ఆడుతూ మ్యాచ్ ను నిలబెట్టారు.  రహానే 81 పరుగులు, రాహుల్ 44 పరుగులతో రాణించి జట్టును ఆదుకున్నారు. అలాగే విహారీ 32 పరుగులతో పరవాలేదనిపించాడు. దీంతో మొదటిరోజు ఆటముగిసేసరికి భారత్ 203/6 గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ప్రస్తుతం రిషబ్ పంత్(20 పరుగులు), రవీంద్ర జడేజా(3 పరుగులు) క్రీజులో వున్నారు.