క్వీన్స్ పార్కులో జోరు వాన! హోటల్ గదుల్లోనే ఇరు జట్లు... మ్యాచ్ ఫలితం తేలడం కష్టమే...
వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కానున్న ఐదో రోజు... ఇంకా హోటల్ గదులకే పరిమితమైన ఇరు జట్లు.. ఆట సాగకపోతే డ్రాగా ముగియనున్న రెండో టెస్టు..

తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన వెస్టిండీస్ జట్టు, రెండో టెస్టులో ఓటమి అంచున నిలిచింది. అయితే టీమిండియా విజయానికి వరుణుడు అడ్డుగా నిలిచాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆటకు పలుమార్లు అంతరాయం కలిగింది. ఓవరాల్‌గా 63 ఓవర్ల మాత్రమే సాధ్యమైంది... ఆఖరి రోజు టీమిండియా విజయానికి 8 వికెట్లు అవసరం ఉండగా ఓటమి నుంచి తప్పించుకోవాలంటే వెస్టిండీస్ రోజంతా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. గెలవాలంటే ఆఖరి రోజు 289 పరుగులు చేయాల్సి ఉంటుంది..
అయితే ఐదో రోజు ఉదయాన్నే పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జోరు వాన కురవడంతో ఆట ఆలస్యం కానుంది. వర్షం కారణంగా ఇరు జట్లు హోటల్ గదులకే పరిమితం అయ్యాయి. వర్షం తగ్గితే కానీ ఇరు జట్ల ప్లేయర్లు స్టేడియానికి చేరుకోరు. మ్యాచ్‌లో ఆఖరి రోజు కావడంతో ఈ రోజు ఆట సాధ్యం కాకపోతే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. ఇది ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో టీమిండియాకి ఇదే మొట్టమొదటి సీజన్. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలిచి 100 శాతం విన్నింగ్ పర్సెంటేజ్ అందుకున్న టీమిండియా, రెండో టెస్టులోనూ గెలిస్తేనే దాన్ని 100గా కాపాడుకోగలుగుతుంది. రెండో టెస్టు డ్రాగా ముగిస్తే టీమిండియాకి 33.33 శాతం పాయింట్లు మాత్రమే వస్తాయి. దీంతో టీమిండియా విన్నింగ్ పర్సంటేజ్ 66.66కి పడిపోతుంది..
ఈ టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఐదు నెలల వరకూ టెస్టు క్రికెట్ ఆడడం లేదు భారత జట్టు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్, ఆ తర్వాత టీ20 సిరీస్ ఆడుతుంది భారత జట్టు. ఆ తర్వాత ఐర్లాండ్ టూర్‌లో టీ20 సిరీస్, ఆసియా కప్ 2023, ఆసియా క్రీడలు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలతో వైట్ బాల్ క్రికెట్ షెడ్యూల్‌తో యమా బిజీగా గడపనుంది టీమిండియా...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే టీమిండియా, అక్కడ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. గత పర్యటనలో మూడు టెస్టుల సిరీస్ ఆడిన టీమిండియా, ఈ సారి బిజీ షెడ్యూల్ కారణంగా ఓ టెస్టు మ్యాచ్ తగ్గించుకుంది. సౌతాఫ్రికాలో ఇంతవరకూ టెస్టు సిరీస్ గెలవలేకపోయిన భారత జట్టు, 2021-22 పర్యటనలోనూ 2-1 తేడాతో టెస్టు సిరీస్ ఓడింది..
సౌతాఫ్రికా పర్యటన తర్వాత వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లాండ్‌తో స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత 2024 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో, అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లు ఆడనుంది భారత జట్టు...