విశాఖపట్నం: వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డే మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. అయితే, ఆ తర్వాత తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించాడు. ఫ్యాన్స్ కు తన యానిమేటెడ్ సెలబ్రేషన్ తో వినోదం అందించలేదు. 

వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పోలార్డ్ కూడా గోల్డెన్ డక్ గానే వెనుదిరిగాడు. ట్వంటీ20 సిరీస్ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ కెస్రిక్ విలియమ్స్ ను విరాట్ కోహ్లీ సిగ్నేచర్ నోట్ బుక్ వేడుకతో హేళన చేశాడు. తొలి వన్డేలో రవీంద్ర జడేజా వివాదాస్పదమైన అవుట్ పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Also Read: విశాఖ వన్డే: కేఎల్ రాహుల్ మీద రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్య

మైదానంలో విరాట్ కోహ్లీ ఎందుకు అలా ప్రవర్తిస్తాడనేది తనకు తెలియదని వెస్టిండీస్ కెప్టెన్ కీరోన్ పోలార్డ్ అన్నాడు. అలా ఎందుకు ప్రవర్తిస్తున్నావని మీరు విరాట్ కోహ్లీనే అడగండని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నాడు. కోహ్లీకి ఆ ప్రశ్న వేసి జవాబు రాబట్టుకోండని, తనకు మాత్రం ఆ విషయం తెలియదని అన్నాడు.

రెండో వన్డేలో తాము మంచి స్థితిలోనే ఉన్నామని, అయితే క్రమం తప్పకుండా వికెట్లు పడుతుండడంతో వెనకంజ వేయాల్సి వచ్చిందని, లక్ష్యాన్ని ఛేదించడంలో తాము అక్కడే పొరపాటు చేశామని, దాన్ని తాము అంగీకరిస్తామని పోలార్డ్ అన్నాడు. ఇండియా ఇన్నింగ్స్ చివరి పది ఓవర్లలోనే ఆట తీరు మారిపోయిందని అన్నాడు. 

Also Read: మేం చేసిన తప్పు అదే: ఇండియాపై ఓటమి మీద పోలార్డ్

వెస్టిండీస్ తో విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో ఇండియా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ ముందు 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచి, ఒత్తిడికి గురి చేసింది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ సెంచరీలు చేయడమే కాకుండా కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. దీంతో భారత్ 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.