Asianet News TeluguAsianet News Telugu

ఒకే సెషన్‌లో 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా... రోహిత్ శర్మ సెంచరీ మిస్! విండీస్ సూపర్ కమ్‌బ్యాక్..

టీ బ్రేక్ సమయానికి 50.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసిన భారత జట్టు... ఒకే సెషన్‌లో నాలుగు వికెట్లు తీసి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన వెస్టిండీస్.. 

India vs West Indies 2nd Test, Team India lost 4 early wickets, Rohit Sharma, Virat Kohli, Yashasvi Jaiswal CRA
Author
First Published Jul 21, 2023, 12:18 AM IST

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు తొలి సెషన్‌లో పూర్తి ఆధిక్యం కనబర్చిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో వెంటవెంటనే వరుసగా 4 వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ సమయానికి 50.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది భారత జట్టు. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.  యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..

లంచ్ బ్రేక్‌కి ముందు స్లిప్‌లో క్యాచ్ డ్రాప్ కావడంతో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న యశస్వి జైస్వాల్, ఆ అవకాశాన్ని పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. 74 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లోనే కిర్క్ మెక్‌కెంజీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

మొదటి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 228త పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (288 పరుగులు), సౌరవ్ గంగూలీ (267) తర్వాతి స్థానంలో నిలిచాడు.

వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన శుబ్‌మన్ గిల్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి కీమర్ రోచ్ బౌలింగ్‌లో జోషువా డి సిల్వకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 143 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేసిన రోహిత్ శర్మ, వర్రీకాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
 
2019లో టెస్టు ఓపెనర్‌గా మారిన రోహిత్ శర్మ, ఓపెనర్‌గా టెస్టుల్లో 2 వేల పరుగులతో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. మార్నస్ లబుషేన్, బాబర్ ఆజమ్, స్టీవ్ స్మిత్, జో రూట్, ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, ట్రావిస్ హెడ్ మాత్రమే ఇంతకుముందు ఈ ఫీట్ సాధించారు.

80-99 స్కోర్ల మధ్య అవుట్ కావడం రోహిత్ శర్మకి ఇది 15వ సారి. సచిన్ టెండూల్కర్ 51 సార్లు ఈ స్కోర్ల మధ్య అవుట్ కాగా విరాట్ కోహ్లీ 22 సార్లు ఈ స్కోర్ల మధ్య పెవిలియన్ చేరాడు. 

ఒకానొక దశలో 139/0  స్కోరుతో ఉన్న భారత జట్టు, 16 పరుగుల తేడాలో 3 వికెట్లు కోల్పోయి 155/3కి చేరుకుంది. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, మొదటి పరుగు చేసేందుకు 20 బంతులు తీసుకున్నాడు.  విరాట్ కోహ్లీతో కలిసి 12 ఓవర్లలో 27 పరుగుల భాగస్వామ్యం జోడించిన అజింకా రహానే, 36 బంతుల్లో 8 పరుగులు చేసి షాన్నన్ గ్యాబ్రియల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  రహానే వికెట్ పడగానే టీ బ్రేక్ తీసుకున్నారు.. 

Follow Us:
Download App:
  • android
  • ios