Asianet News TeluguAsianet News Telugu

Hyderabad T20: కోహ్లీ కెప్టెన్సీ ఇన్నింగ్స్, విండీస్ పై భారత్ విజయం

భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మొదటి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ తన ముందు ఉంచిన లక్ష్యాన్ని భారత్ ఛేదించి విజయాన్ని అందుకుంది.

India vs West Indies, 1st T20I - Live Cricket Updates, hyderabad
Author
Hyderabad, First Published Dec 6, 2019, 6:57 PM IST

హైదరాబాదులో వెస్టిండీస్ పై జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచును టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో గెలిపించాడు. ఓ వైపు వికెట్లు రాలిపడుతుంటే విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరో 8 బంతులు మిగిలి ఉండగానే భారత్ 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. శ్రేయాస్ అయ్యర్ అవుటైన తర్వాత బ్యాటింగ్ కు దిగిన శివం దూబేను ఒక్క బంతి కూడా ఆడనీయకుండా కోహ్లీయే లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమయ్యాడు.

కోహ్లీ 50 బంతుల్లో ఆరు సిక్స్ లు, ఆరు ఫోర్ల సాయంతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.. దీంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్ మీద విజయం సాధించింది. దీంతో భారత్ మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో 1-0 స్కోరుతో ముందంజలో ఉంది. శివం దూబే సున్నా పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.

 

వెస్టిండీస్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ స్థితిలో భారత్ 11 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో పడింది. శ్రేయాస్ అయ్యర్ కేవలం నాలుగు పరుగులు చేసి అవుటయ్యాడు.భారత్ 22 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో రిషబ్ పంత్ అవుటయ్యాడు. దూకుడుగా ఆడుతూ అతను 9 బంతుల్లో 18 పరుగులు చేసి హోల్డర్ బౌలింగులో అవుటయ్యాడు.

క్లిష్ట సమయంలో ఓపెనర్ లోకేశ్ రాహుల్ ఔటయ్యాడు. కెప్టెన్ కోహ్లీతో కలిసి స్కోరు బోర్డును నడిపించిన రాహుల్ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఖారీ పీర్రె బౌలింగ్‌లో పోలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భారత్ అప్పటికి విజయానికి ఇంకా 37 బంతుల్లో 69 పరుగులు చేయాల్సి ఉంది. లక్ష్యఛేదనలో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 8 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఖారీ పీర్రె బౌలింగ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. హెట్మేయర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

హైదరాబాద్ టీ20లో వెస్టిండీస్.. భారత్ ముందు 208 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇన్నింగ్స్ ఆరంభించిన నాటి నుంచి దూకుడుగా ఆడిన విండీస్ ఆటగాళ్లు జట్టుకు భారీస్కోరు అందించారు.

ఈ క్రమంలో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హెట్మేయర్ 56, లెవిస్ 40, కెప్టెన్ పొలార్డ్ 37 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో చాహల్ 2, వాషింగ్టన్, దీపక్ చాహర్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.

అంతకు ముందు వెస్టిండీస్ ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు బోర్డును పెంచే క్రమంలో కెప్టెన్ పోలార్డ్ 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన హెట్మేయర్ పెవిలియన్ చేరాడు. 56 పరుగుల వ్యక్తిగత స్కోరు చాహల్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి హెట్మేయర్ వెనుదిరిగాడు. 

విండీస్ విధ్వంసక ఆటగాడు హిట్మేయర్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అతను హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇదే క్రమంలో వెస్టిండీస్ 150 పరుగులను దాటింది. 

హెట్మేయర్‌తో కలిసి మరో వికెట్ పడకుండా ధాటిగా ఆడుతున్న బ్రెండన్ కింగ్‌ 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవిచంద్రన్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయినప్పటికీ హెట్మేయర్, కెప్టెన్ పొలార్డ్‌లు ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 12 ఓవర్లలోనే విండీస్ 120 పరుగులు మార్క్ దాటింది. 

ధాటిగా ఆడుతున్న ఎవిన్ లెవిస్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.వెస్టిండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ఓపెనర్ లెండి సిమ్మన్స్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన మొదటి టీ20లో టీమిండియా టాస్ గెలిచింది. ఆ వెంటనే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. 

భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, శివమ్ ధూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యజువేంద్ర చాహల్

వెస్టిండీస్ జట్టు: సిమ్మన్స్, ఎవిన్ లెవిస్, బ్రాండన్ కింగ్, షిమ్ర్ హెట్మేయర్, కీరన్ పొలార్డ్, దినేశ్ రామ్‌దిన్, జేసన్ హోల్డర్, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, విలియమ్స్, ఖారీ పీర్రె

Follow Us:
Download App:
  • android
  • ios