చెన్నై: సెక్యూరిటీ గార్డ్స్ కళ్ల గప్పి ఓ వీధి కుక్క మైదానంలోకి ప్రవేశించి సందడి చేసింది. దాంతో కాసేపు ఆట నిలిచిపోయింది. ఆదివారం నాడు వెస్టిండీస్, భారత్ మధ్య జరిగిన తొలి వన్డే సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. 

శ్రేయాస్ అయ్యర్, రిషబ్ బ్యాటింగ్ చేస్తుండగా 27వ ఓవరులో అకస్మాత్తుగా శునకం మైదానంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో వెస్టిండీస్ బౌలర్ కీమో పాల్ తన కొత్త ఓవరును ప్రారంభించబోతున్నాడు. 

వీధి కుక్క లోనికి ప్రవేశించి సందడి చేయడంతో బిత్తరపోయిన శ్రేయాస్ అయ్యర్ తిరిగి ఆట ప్రారంభించడానికి కొత్త సమయం తీసుకున్నాడు. గ్రౌండ్ స్టాఫ్ లోనికి ప్రవేశించి కుక్కను తరిమేయడానికి ప్రయత్నించారు. అయితే, వారిని అది ముప్పు తిప్పలు పెట్టింది. 

 

వెస్టిండీస్ ఆటగాళ్లలో ఒకతను కూడా దాన్ని బయటకు తరిమేయడానికి ప్రయత్నించాడు. బయటకు వెళ్లడానికి కుక్క కాసేపు సమయం తీసుకుంది. 

టాప్ ఆర్టర్ విఫలమైన స్థితిలో భారత స్కోరును బోర్డును పెంచడానికి రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ప్రయత్నించారు. దాదాపు 18 ఓవర్లు ఆడి 114 పరుగులు జోడించారు. ఇద్దరు కూడా అర్థ సెంచరీలు చేసి భారత్ ను కాపాడారు. అయ్యర్ వన్డేల్లో ఐదో అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 

అయ్యర్ 88 బంతుల్లో 70 పరుగులు చేసి అవుటయ్యాడు. 40వ ఓవరులో రిషబ్ పంత్ పరుగు తీయబోయి అవుటయ్యాడు. అతను 60 బంతుల్లో 71 పరుగులు చేశాడు. దాంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు చేసింది.