తన పదవీ కాలం ఇంకా 18నెలలు ఉండగానే... కోచ్ గా తొలగించడంపై శ్రీలంక జట్టు మాజీ కోచ్ చండిక హతురసింఘ మండిపడుతున్నాడు. అర్థాంతరంగా తనను పదవి నుంచి తొలగించినందుకు 50లక్షల డాలర్లు( రూ.36కోట్లు)  ఇవ్వాలని ఆయన శ్రీలంక క్రికెట్ బోర్డును డిమాండ్ చేశారు.

2019 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు ఘోర పరాభవం మూటగట్టుకుంది. పేలవ ప్రదర్శనతో ఏ దశలోనూ పోటీలో నిలవలేకపోయింది. దీంతో కోచ్ హతురసింఘ సహా సహాయక సిబ్బందిపై బోర్డు వేటేసింది.
 
అయితే, నిజానికి ఒప్పందం ప్రకారం హతురసింఘ పదవీ కాలం మరో 18 నెలలు ఉంది. అర్ధంతరంగా తనను తొలగించడం వల్ల తన కోచింగ్ కెరీర్‌పై ప్రభావం చూపిస్తుందని హతురసింఘ ఆవేదన వ్యక్తం చేస్తూ బోర్డుకు లేఖ రాశాడు. తనకు రూ.36 కోట్లు చెల్లించాలని ఆ లేఖలో డిమాండ్ చేశాడు. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు మాత్రం ఆరు నెలల వేతనాన్ని మాత్రమే చెల్లించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, కోచ్‌గా హతురసింఘ నెలకు 60 వేల డాలర్లు తీసుకునేవాడు.