పుణే టీ20లో భారత్.. శ్రీలంకపై 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 15.5 ఓవర్లలో 123 పరుగులకే అలౌటైంది.

ధనుంజయ డిసిల్వా 57 పరుగులతో రాణించాడు. అతనికి మాథ్యూస్ సహకారం అందించినప్పటికీ వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో శ్రీలంక కోలుకోలేకపోయింది. భారత బౌలర్లలో నవదీప్ షైనీ 3, శార్దూల్, వాషింగ్టన్ సుందర్ తలో రెండు వికెట్లు తీశారు. దీంతో మూడు వన్డేల టీ20 సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

భారత్ విజయానికి ఒక వికెట్ దూరంలో నిలిచింది. ధాటిగా ఆడిన ధనుంజయ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద బుమ్రాకు దొరికిపోయాడు.

లంక ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో సందకన్ క్రీజును వదిలి ముందుకు రాగా.. కీపర్ సంజూ శాంసన్ రెప్ప పాటులో వికెట్లను గిరటేశాడు. 

శ్రీలంక ఒకే ఓవర్‌లో రెండు వికెట్ల కోల్పోయింది. శార్ధూల్ వేసిన 13వ ఓవర్‌లో దాసున్ శంకర 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శార్ధూల్‌కే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాతి బంతిని ఆడిన హసరంగ పరుగు కోసం ప్రయత్నించి చాహల్ వేసిన అద్భుతమైన త్రోకు రనౌట్ అయ్యాడు.

భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని లంకకు విజయంపై ఆశలు కల్పించిన మాథ్యూస్-ధనుంజయ జంటను వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్‌కు యత్నించిన మాథ్యూస్‌ బౌండరీ లైన్ వద్ద మనీశ్ పాండే‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు

శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. నవదీప్ షైనీ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన కుశాల్ పెరీరా 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్లీన్ బౌల్డయ్యాడు.

భారత బౌలర్లు, ఫీల్డర్ల ధాటికి లంక ఏమాత్రం నిలబడలేకపోతోంది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మనీశ్ పాండే అద్బుత ఫీల్డింగ్‌కు మాథ్యూస్ రనౌట్ అయ్యాడు.

శ్రీలంక కొద్ది పరుగుల తేడాతో ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. శార్ధూల్ ఠాకూర్ వేసిన రెండో ఓవర్‌లో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బుమ్రా బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ గుణతిలక ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు.

చివరి టీ20లో భారత బ్యాట్స్‌మెన్లు ఎప్పటిలాగే రెచ్చిపోవడంతో భారత్ .. శ్రీలంక ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు లోకేశ్ రాహుల్ 54, శిఖర్ ధావన్ 52 శుభారంభం అందించారు. మధ్యలో లంక బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీసినప్పటికీ మ్యాచ్‌పై పట్టుబిగించ లేకపోయారు.

చివర్లో శార్ధూల్ ఠాకూర్ 22, మనీశ్ పాండే 31 పరుగులతో లంక బౌలర్లను ఊచకోత కోయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో సందకన్ 3, లహిరు కుమార, హసరంగ తలో వికెట్ పడగొట్టారు.

కెప్టెన్ కోహ్లీ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. లహిరూ కుమార బౌలింగ్‌లో స్క్వేర్ లేగ్‌లో కట్ చేసిన బంతిని సందకన్ అందుకున్నాడు.

ఉన్న కాసేపు చూడచక్కని షాట్లతో అలరించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు.

భారత్ క్షణాల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ సందకన్ వేసిన 12వ ఓవర్‌లో వరుసగా ఓపెనర్ లోకేశ్ రాహుల్ 54, శ్రీయస్ అయ్యర్‌ 4ను ‌ఔట్ చేసి భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ, మనీశ్ పాండే క్రీజులో ఉన్నారు. 

ఓపెనర్ లోకేశ్ రాహుల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రాణిస్తున్నాడు. 34 బంతుల్లో అర్థసెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఇందులో 4 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. 

దొరక్క దొరక్క ఓ మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశం వచ్చిందని ఆశ పడేలోగా.. సంజూ శాంసన్‌ను దురదృష్టం వెంటాడింది. 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసరంగ బౌలింగ్‌లో సంజూ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత అభిమానులు నిరాశకు గురయ్యారు.

దూకుడుగా ఆడిన ఓపెనర్ శిఖర్ ధావన్ 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సందకన్ బౌలింగ్‌లో గుణతిలకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు 34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో ధావన్ హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.

భారత్-శ్రీలంకల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా పుణేలో జరుగుతున్న చివరి టీ20లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ మలింగ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండో మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా.. చివరి టీ20 కూడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుండగా... మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని లంకేయులు భావిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. శివమ్ ధూబే, రిషబ్ పంత్, కుల్‌దీప్ యాదవ్‌ల స్థానంలో సంజూ శాంసన్, మనీశ్ పాండే, యజువేంద్ర చాహల్‌ను తుది జట్టులోకి తీసుకుంది.