పూణే: తమ జట్టు ఓపెనర్ రోహిత్ శర్మకు బ్రేక్ ఇవ్వండని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జర్నలిస్టులకు సూచించాడు. టెస్టు మ్యాచుల్లో రోహిత్ శర్మ ఏం చేయబోతున్నాడనే విషయంపై దృష్టి కేంద్రీకరించడం మానేయాలని ఆయన కోరారు. విశాఖ టెస్టు మ్యాచులో రోహిత్ శర్మ తన అనుభవాన్ని ఉపయోగించాడని కోహ్లీ అన్నాడు. అప్పటి నుంచి రోహిత్ కు గొప్ప స్పేస్ లభించిందని అన్నాడు.

దక్షిణాఫ్రికాపై విశాఖపట్నంలో జరిగిన టెస్టు మ్యాచులో రోహిత్ శర్మ రెండు సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. "ఆ కుర్రాడికి బ్రేక్ ఇవ్వండి, అతను బాగా ఆడాడని మీకు తెలుసు. వైట్ బాల్ క్రికెట్ లో వినోదాన్ని అనుభవించినట్లు అనుభవించనీయండి. టెస్టుల్లో రోహిత్ శర్మ ఏం చేయబోతున్నాడనే విషయంపై దృష్టి పెట్టడం మానేయండి" అని కోహ్లీ అన్నాడు. 

రెండో టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కోహ్లీ బుధవారం మీడియాతో మాట్లాడాడు. రోహిత్ శర్మ నిజంగా అద్భుతంగా ఆడుతున్నాడని, తొలి మ్యాచులో రిలాక్స్ అయినట్లు కనిపించాడని, చూడడానికి కూడా అతని ఆట పసందుగా ఉందని కోహ్లీ అన్నాడు. కొన్నేళ్లుగా గడించిన అనుభవాన్ని ఆ మ్యాచులో అతను వాడుకున్నాడని కూడా అన్నాడు.