మహాత్మా గాంధీ-నెల్సన్‌ మండేలా ఫ్రీడమ్‌ ట్రోఫీలో భాగంగా భారత్-సౌతాఫ్రికాల మధ్య మూడు టెస్టుల సీరిస్ జరగనున్న విషయం తెలిసిందే. విశాఖపట్నంలో రేపు బుధవారం గాంధీ జయంతి(అక్టోబర్ 2వ తేదీ)రోజున మొదటి టెస్ట్ ప్రారంభంకానుంది. ఇందులో పాల్గొనే తుది జట్టును టీమిండియా మేనేజ్‌మెంట్ తాజాగా ప్రకటించింది. ముందుగా ఊహించినట్లే రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. అలాగే వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారిన రిషబ్ పంత్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఈ సీరిస్ మొత్తానికి అతడు దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

వృద్దిమాన్ సాహా గాయంనుండి పూర్తిగా కోలుకోవడంతో పంత్ పై వేటు తప్పలేదు. సాహాకు వైజాగ్ టెస్ట్ లో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ గా అవకాశం లభించింది. అలాగే వెస్టిండిస్ పర్యటనలో రాణించిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి కూడా తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇలా అతడు సొంతగడ్డపై మొదటిసారి టెస్ట్ ఆటగాడిగా ప్రేక్షకులముందుకు రానున్నాడు. 

వెస్టిండిస్ పర్యటనకు ఎంపికైనప్పటికి తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సీరియర్లకు ఈసారి అవకాశం లభించింది. రోహిత్ శర్మతో పాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి టెస్ట్ లో బరిలోకి దిగనున్నారు. రోహిత్ ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ ఓపెనర్ గా మారనున్నాడు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ లో ఓపెనర్ గా  విఫలమైన రోహిత్ మెయిన్ మ్యాచ్ లో ఎలా ఆడతాడో చూడాలి. 

ఈ టెస్ట్ లో భారత్ కేవలం ఇద్దరు స్పెషల్ పేసర్లతో మాత్రమే బరిలోకి దిగుతోంది. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ పేస్ బౌలర్ల  కోటాలో, అశ్విన్ స్పిన్నర్ కోటాలో చోటు దక్కించుకున్నారు. ఇక  పార్ట్ టైమ్ బౌలర్లుగా జడేజా, విహారీలు  ఉపయోగపడనున్నారు. మొత్తానికి బౌలింగ్ లో కంటే టీమిండియా బ్యాటింగ్ విభాగంలోనే  బలంగా కనిపిస్తోంది. 

భారత తుదిజట్టిదే...

విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజ, వృద్దిమాన్ సాహా(వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ