టీమిండియా యువ ఓపెనర్ కెఎల్ రాహుల్ కు సెలెక్టర్లు షాకిచ్చారు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సీరిస్ నుండి అతన్ని పక్కనబెట్టారు. తాజాగా ప్రకటించిన భారత జట్టులో రాహుల్  కు చోటు దక్కలేదు. దీంతో సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మకు లైన్ క్లియర్ అయ్యింది. 

తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 15 ఆటగాళ్లలో కూడిన టెస్ట్ జట్టును ప్రకటించింది. వెస్టిండిస్ పర్యటనలో ఘోరంగా విఫలమైన కెఎల్ రాహుల్ ను జట్టులోంచి తప్పించారు. కానీ మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు మరో అవకాశాన్నిచ్చారు. ఇక విండీస్ పర్యటనలో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ మయాంక్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. మరో యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ కు కూడా సెలెక్టర్ల నుండి పిలుపు వచ్చింది.

ఈ నెల 15వ తేదీ నుండి జరిగే టెస్ట్ సీరిస్ లో చోటు దక్కించుకోలేకపోయిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు టెస్టుల్లో మాత్రం చోటు దక్కింది. కానీ మరో స్పిన్నర్ యజువేందర్ చాహల్ కు చోటు దక్కలేదు. ఇక వెస్టిండిస్ సీరిస్ మొత్తంలో వికెట్ కీపర్ గా రాణించకపోయినప్పటికి సెలెక్టర్లు రిషబ్ పంత్ కు మరో అవకాశం ఇచ్చారు. అతడితో పాటు వృద్దిమాన్ సాహాకు కూడా జట్టులో చోటు దక్కింది.  వెస్టిండిస్ పై సెంచరీతో చెలరేగిన తెలుగు తేజం హనుమ విహారికి కూడా మరో అవకాశం లభించింది.  

సౌతాఫ్రికాతో తలపడే భారత జట్టిదే...

 మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), చతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌, వృద్ధిమాన్‌ సాహా, రవి చంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌