విశాఖపట్నం: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలకు బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ బ్యాట్ తో సమాధానం చెప్పాడు. టెస్టు మ్యాచులకు పనికి రాడంటూ కొన్నాళ్లు టెస్టు జట్టుకు రోహిత్ ను దూరం పెట్టారు. జట్టులోకి వచ్చినా కూడా తుది జట్టులోకి ఆయనను తీసుకోలేదు. అయితే, తాను పరిమిత ఓవర్ల మ్యాచులనే కాదు, టెస్టు మ్యాచులను కూడా దడదడలాడిస్తానని రోహిత్ శర్మ రుజువు చేశాడు. 

దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు సాధించాడు. ఓపెనర్ గా ఒక టెస్టు మ్యాచులో రెండు సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్ మన్ గా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు. గతంలో అతను మిడిల్ ఆర్డర్ లో ఆడాడు. 

తొలి ఇన్నింగ్సులో 176 పరుగులు చేసిన రోహిత్ శర్మరెండో ఇన్నింగ్సులోనూ సెంచరీ చేశాడు.  దానికితోడు సిక్స్ ల మోతలో కూడా పలు రికార్డులు సాధించాడు. తొలి ఇన్నింగ్సులో మయాంక్ అగర్వాల్ తో కలిసి ఒక టెస్టు మ్యాచులో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును రోహిత్ నమోదు చేశాడు. 

తాజాగా వ్యక్తిగతంగా ఒక టెస్టు మ్యాచులో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్సులో ఆరు సిక్సర్లు కొట్టిన డాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ రెండో ఇన్నింగ్సులో మూడో సిక్స్ సాధించిన తర్వాత మరో అరుదైన రికార్డును సృష్టించాడు. ఒక టెస్టు మ్యాచులో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. 

ఆ క్రమంలోనే రోహిత్ శర్మ 25 ఏళ్ల క్రితం నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 1994లో ఊక మ్యాచులో సిద్ధూ ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. ఇది ఇప్పటి వరకు భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కాగా, దాన్ని రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. 

నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్సులో ఏడు సిక్సర్లు సాధించాడు. దాంతో ఒక మ్యాచులో అతను పది సిక్సర్లు కొట్టిన ఘనతను సాధించాడు. దానికితోడు, భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కూడా ఒక మ్యాచులో అత్యధిక వ్యక్తిగత సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా రికార్డు సాధించాడు. 

వన్డేల్లో అతను 16 సిక్సర్లు, ట్వంటీ20లో పది సిక్సర్లు కొట్టాడు. దాంతో మూడు ఫార్మాట్లలో భారత్ తరఫున ఒక మ్యాచులో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును నెలకొల్పాడు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు శనివారం 4 వికెట్ల నష్టానికి 323 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్సును భారత్ డిక్లేర్ చేసింది. మయాంక్ అగర్వాల్ 7 పరుగులు మాత్రమే చేసి అవుటైన తర్వాత రోహిత్ శర్మ పుజారాతో కలిసి ఇన్నింగ్సును చక్కదిద్దాడు. రోహిత్ శర్మ 127 పరుగులు చేయగా, పుజారా 81 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 40 పరుగులు చేశాడు. 

విరాట్ కోహ్లీ 31 పరుగులతో, అజింక్యా రహానే 27 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మహరాజ్ రెండు వికెట్లు తీయగా, ఫిలందర్, రబడలకు చెరో వికెట్ దక్కింది. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్సు స్కోరుపై భారత్ 394 పరుగుల ఆధిక్యతను సాధించింది. విజయానికి దక్షిణాఫ్రికా 395 పరుగులు చేయాల్సి ఉంటుంది.