విశాఖపట్నం: ఓపెనర్ గా రెండు ఇన్నింగ్సుల్లో రెండు సెంచరీలు సాధించి ఘనత సాధించిన టీమిండియా హిట్టర్ రోహిత్ శర్మ అనుచిత వ్యాఖ్యలకు వార్తల్లోకి ఎక్కాడు. సహచర ఆటగాడు ఛతేశ్వర పుజారాను అనుచిత వ్యాఖ్యలతో రోహిత్ శర్మ దూషించాడు.

 

దక్షిణాఫ్రికాపై జరిగిన టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్సులో పుజారాతో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించే ప్రయత్నం చేశాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలో సింగిల్ కు పుజారాను ఆహ్వానించాడు. దానికి పుజారా నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో పుజారాపై రోహిత్ తిట్లదండకం అందుకున్నాడు.

రోహిత్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు స్ట్రైకింగ్ ఎండ్ లోని మైక్ లో రికార్డయింది. ఈ సంఘటన విరాట్ కోహ్లీ, ఇంగ్లాండు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మధ్య జరిగిన సంఘటనను గుర్తు చేస్తోందని అంటున్నారు. రోహిత్ శర్మ ఉదంతాన్ని బెన్ స్టోక్స్ ట్విట్టర్ లో ప్రస్తావించాడు. 

 

ఈసారి రోహిత్ సమయం... విరాట్ ది కాదు. ఈ తిట్టు ఏమిటో తెలుసా, తెలిసే ఉంటుందిలే అని బెన్ స్టోక్స్ చమత్కరించాడు. గతంలో ఇంగ్లాండుతో జరిగిన మ్యాచులో కోహ్లీ ఇలాగే దూషించడాన్ని స్టోక్స్ గుర్తు చేశాడు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. బెన్ స్టోక్స్ ట్వీట్ పై హర్భజన్ సింగ్ స్మైలీ ఎమోజీలతో స్పందించాడు.