Asianet News TeluguAsianet News Telugu

India vs South Africa: రిషబ్ పంత్ సూపర్ సెంచరీ... సిరీస్ డిసైడర్‌లో సెన్సేషనల్ ఇన్నింగ్స్...

INDvsSA 3rd Test: సౌతాఫ్రికా గడ్డ మీద సెంచరీ చేసిన మొట్టమొదటి భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రిషబ్ పంత్... 

India vs South Africa:   Rishabh Pant Record Century in Series Decider Cape town test
Author
India, First Published Jan 13, 2022, 6:50 PM IST

INDvsSA 3rd Test: సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే కేప్‌టౌన్ టెస్టులో  రిషబ్ పంత్ అద్భుత సెంచరీ ఇన్నింగ్స్ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకి ఆలౌట్ అయ్యింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 13 పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి సౌతాఫ్రికాకి 212 పరుగుల టార్గెట్‌ను సెట్ చేసింది టీమిండియా...

ఓవర్‌నైట్ స్కోరు 57/2తో మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టి మొదటి రెండు ఓవర్లలోనే పూజారా, రహానే వికెట్లు కోల్పోయిన టీమిండియాని విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులతో లంచ్ బ్రేక్‌కి వెళ్లింది టీమిండియా...

కోహ్లీ, రిషబ్ పంత్ కలిసి ఐదో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే, అందులో విరాట్ చేసింది 15 పరుగులే... పూర్తిగా రిషబ్ పంత్ డామినేషనే కనిపించింది.
India vs South Africa:   Rishabh Pant Record Century in Series Decider Cape town test

అగ్రెసివ్ కెప్టెన్సీ, అగ్రెసివ్ బ్యాటింగ్‌ చేసే విరాట్ కోహ్లీ... పరిస్థితులకు తగ్గట్టుగా తన బ్యాటింగ్ స్టైల్‌ను కూడా మార్చుకున్నాడు...లంచ్ బ్రేక్ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది టీమిండియా. 143 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, లుంగి ఇంగిడి బౌలింగ్‌లో మార్క్‌రమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 152 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు...

ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 15 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి లుంగి ఇంగిడి బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ 10 బంతుల్లో డకౌట్ అయ్యాడు...

ఆ తర్వాత మహ్మద్ షమీ కూడా 10 బంతులాడి పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు. 189 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది భారత జట్టు. 

రబాడా బౌలింగ్‌లో ఫోర్ బాది 98 పరుగులకు చేరుకున్న రిషబ్ పంత్, ఆఖరి బంతికి సింగిల్ తీశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

సౌతాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. 2010లో సెంచూరియన్‌లో 90 పరుగులు చేసిన ఎమ్మెస్ ధోనీ రికార్డును అధిగమించాడు రిషబ్ పంత్...

ఇంగ్లాండ్‌లో (114), ఆస్ట్రేలియాలో (159) పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా నిలిచిన రిషబ్ పంత్, సౌతాఫ్రికా గడ్డ మీద కూడా ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 

133 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ మార్కును అందుకున్నాడు రిషబ్ పంత్. సౌతాఫ్రికాలో సెంచరీ చేసిన మొదటి ఆసియా వికెట్ కీపర్‌గా నిలిచిన రిషబ్ పంత్, ఒకే ఇన్నింగ్స్‌లో రెండు కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన భారత వికెట్ కీపర్‌గానూ నిలిచాడు...

మూడో రోజు టీమిండియాకి మొదటి ఓవర్ రెండో బంతికే షాక్ తగిలింది. 33 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో కీగన్ పీటర్సన్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత 9 బంతుల్లో 1 పరుగు చేసిన అజింకా రహానే... కగిసో రబాడా బౌలింగ్‌లో డీన్ ఎల్గర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఆన్రీచ్ నోకియా గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో టెస్టు ఆరంగ్రేటం చేసిన మార్కో జాన్సెన్... పూజారా వికెట్‌తో 17 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఆరంగ్రేటం సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన సౌతాఫ్రికా బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు జాన్సెన్...

ఇంతకుముందు 1995-96లో ఇంగ్లాండ్‌పై ఆరంగ్రేటం చేసిన షాన్ పోలాక్ 16 వికెట్లు తీయగా, ఇప్పటికే 17 వికెట్లు తీసిన జాన్సెన్... 26 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు...

రెండో ఇన్నింగ్స్‌లో 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకి ఆలౌట్ కాగా, సౌతాఫ్రికా జట్టు 210 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత జట్టుకి 13 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. సౌతాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సన్ 72 పరుగులు చేయగా కేశవ్ మహరాజ్ 25, భవుమా 28, వాన్ దేర్ దుస్సేన్ 21 పరుగులు చేశారు...

భారత బౌలర్ జస్ప్రిత్ బుమ్రా 5 వికెట్లు తీయగా ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలకు చెరో రెండేసి వికెట్లు దక్కాయి. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశాడు... 
 

Follow Us:
Download App:
  • android
  • ios