విశాఖపట్నం: దక్షిణాఫ్రికాపై విశాఖపట్నంలో జరిగిన తొలి టెస్టు మ్యాచులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. పేసర్ మొహమ్మద్ షమీ, జడేజాలు చెలరేగడంతో భారత్ 203 పరుగుల తేడాతో సఫారీలను మట్టి కరిపించిన విషయం తెలిసిందే. 

భారత్ నిర్దేశించిన 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా స్థిరంగా బ్యాటింగ్ చేయడంలో విఫలమైంది. శనివారంనాడు ఎల్గర్ పెవిలియన్ బాట పట్టగా, ఆదివారం ఆరంభంలోనే బ్రయాన్ ఔటయ్యాడు. దాంతో దక్షిణాఫ్రికా 19 పరుగులకే రెండో వికెట్ జారవిడుచుకుంది. అయితే, ఆదివారం ఆటలో జడేజా బౌలింగ్ మ్యాచ్ కు హైలెట్ గా నిలిచింది. 

జడేజా 27వ ఓవరు తొలి బంతికి మార్కరమ్ అవుట్ చేశాడు. అదే ఓవరు నాలుగో బింతికి ఫిలిందర్ ను, ఐదో బంతికి మహరాజ్ లను డకౌట్ చేశాడు. ఫిలిందర్, మహరాజ్ లు ఎల్బీడబ్ల్యులుగా వెనుదిరిగగా, ఓపెనర్ మార్కరమ్ మాత్రం జడేజా అద్భుతమైన  రిటర్న్ క్యాచ్ తో పెవిలియన్ చేరుకున్నాడు. 

జడేజా వేసిన బంతిన మార్కరమ్ స్ట్రైట్ డ్రైవ్ గా మలిచే ప్రయత్నం చేశాడు. అయితే, రెప్పపాటులో జడేజా బంతిని గాలిలో అందుకున్నాడు. దాంతో మార్కరమ్ 39 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఇదే మ్యాచును మలుపు తిప్పిందని చెప్పవచ్చు. 

మార్కరమ్ అవుటైన ఓవరులోనే ఫిలిందర్, మహరాజ్ అవుట్ కావడంతో మ్యాచుపై ఇండియాకు పట్టు చిక్కింది. రెండో సెషన్ లో భారత్ కాస్తా కష్టపడినా ఫలితం మాత్రం దక్కించుకుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్సు హీరో డీన్ ఎల్గర్ కూడా జడేజా బౌలింగులోనే అవుటయ్యాడు.