గాయంతో వన్డే సిరీస్ నుంచి దూరమైన దీపక్ చాహార్.. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కి పిలుపునిచ్చిన సెలక్టర్లు... 

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ దగ్గర పడుతున్న కొద్దీ గాయాల బారిన పడుతున్న భారత క్రికెటర్ల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయాలతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఆల్‌రౌండర్ దీపక్ చాహార్ కూడా గాయపడి, సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కి దూరమయ్యాడు...

ఐపీఎల్ 2022 టోర్నీకి ముందు వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడిన దీపక్ చాహార్, దాదాపు ఆరు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో స్పెషలిస్ట్ అయిన దీపక్ చాహార్, 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. బాల్‌తోనే కాకుండా బ్యాటుతోనూ అదరగొడుతూ టీమిండియాకి కావాల్సిన పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు...

Scroll to load tweet…

ఈ కారణంగానే ఐపీఎల్ 2022 మెగా వేలంలో దీపక్ చాహార్‌ని రూ.14 కోట్ల భారీ మొత్తం పెట్టి మరీ కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే గాయంతో దీపక్ చాహార్, ఐపీఎల్ 2022 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దాదాపు ఆరు నెలల గ్యాప్ తర్వాత జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు దీపక్ చాహార్. రీఎంట్రీ మ్యాచ్‌లో 7 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన దీపక్ చాహార్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు...

జస్ప్రిత్ బుమ్రా గాయంతో టీ20 వరల్డ్ కప్‌కి దూరం కావడంతో అతని ప్లేస్‌లో దీపక్ చాహార్ సరైన రిప్లేస్‌మెంట్ అవుతాడని భావించారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే దీపక్ చాహార్ మణికట్టు గాయంతో బాధపడుతూ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి దూరమయ్యాడు...

తొలి వన్డేలో దీపక్ చాహార్‌కి చోటు దక్కకపోవడంపై అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చాహార్‌కి బదులుగా ఆవేశ్ ఖాన్‌ని ఆడించడంపై విమర్శలు చేశారు. అయితే దీపక్ చాహార్ గాయంతో బాధపడుతుండడంతోనే అతనికి తుది జట్టులో చోటు దక్కలేదని తేలింది...

దీపక్ చాహార్ మణికట్టు గాయంతో బాధపడుతూ సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కి దూరమయ్యాడు. దీంతో అతని ప్లేస్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కి వన్డే సిరీస్‌లో చోటు దక్కింది. వాషింగ్టన్ సుందర్ కూడా కొన్ని రోజులుగా గాయాలతో బాధపడుతున్నాడు...

బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన వాషింగ్టన్ సుందర్, ఆ తర్వాత గాయాలతో సతమతమవుతూ జట్టుకి దూరమవుతూ వచ్చాడు. గత ఏడాది మార్చిలో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడిన వాషింగ్టన్ సుందర్, ఈ ఏడాది ఆరంభంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో భారత్ ఏ జట్టులో చోటు దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్, గాయంతో ఆ టూర్ నుంచి కూడా వైదొలిగాడు. 

తాజాగా కౌంటీల్లో లంకాషైర్ క్లబ్ తరుపున ఆడిన వాషింగ్టన్ సుందర్, అక్కడ కూడా గాయపడి మధ్యలోనే వెనక్కి వచ్చేశాడు... తన కెరీర్‌లో 4 వన్డేలు ఆడిన వాషింగ్టన్ సుందర్, 5 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 2 ఇన్నింగ్స్‌ల్లో 57 పరుగులు చేశాడు.