మహాత్మా గాంధీ-నెల్సన్‌ మండేలా ఫ్రీడమ్‌ ట్రోఫీలో భారత్ కు అద్భతమైన శుభారంభం లభించింది. విశాఖపట్నం వేదికన జరుగుతున్న మొదటి టెస్ట్ లో కోహ్లీసేన భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లను చిత్తుచేస్తూ ఓపెనర్లు చెలరేగడంతో మొదటి రెండు రొజులూ  టీమిండియాదే పైచేయిగా నిలిచింది. దీంతో భారత్ 136 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 502 పరుగుల భారీ చేయగలిగింది. ఈ స్కోరు వద్దే మొదటి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన కోహ్లీ సౌతాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించాడు. 

బుధవారం గాంధీజయంతి సందర్భంగా విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో మొదటి టెస్ట్ ప్రారంభమయ్యింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనింగ్ జోడి అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ పరుగులు అందించారు. టెస్టుల్లో మొదటిసారి ఓపెనింగ్ చేస్తున్న రోహిత్, యువ ఓపెనర్ మయాంక్ లు అద్భుతంగా రాణించారు. రోహిత్ సెంచరీ,మయాంక్ హాఫ్ సెంచరీతో నాటౌగ్ గా నిలవడంతో 202 పరుగుల వద్ద మొదటిరోజు ఆట ముగిసింది. 

ఇలా 202 పరగుల ఓవర్ నైట్ స్కోర్ వద్ద గురువారం రెండోరోజు మ్యాచ్ ప్రారంభమయ్యింది. ఇందులో కూడా ఓపెనర్ల హవానే కొనసాగింది. అయితే 176 పరుగుల వద్ద రోహిత్ ఔటవడంతో 317 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ ఆ తర్వాత మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పరుగుల వేగాన్ని మరింత పెంచి డబుల్ సెంచరీని సాధించాడు. 215 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఔటయినా అప్పటికే భారత్ భారీ స్కోరు కు చేరుకుంది. 

ఓపెనర్లు సెంచరీలతో చెలరేగగా మిగతా ఆటగాళ్లు మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయారు. రవీంద్ర జడేజా 30నాటౌట్, అశ్విన్ 1నాటౌట్, వృద్దిమాన్ సాహా 21, కోహ్లీ 20, రహానే 15, విహార 10, పుజారా 6 పరుగులు  మాత్రమే చేయగలిగారు. అయితే వీరు రాణించకున్నా భారత స్కోరు 502/7 కు చేరుకుంది. దీంతో కెప్టెన్ కోహ్లీ ఇదే స్కోరు వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి సౌతాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించారు.