విశాఖపట్నం వేదికన భారత్-సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత ఓపెనర్లు అదరగొట్టారు. రోహిత్ శర్మ సెంచరీ(176 పరుగులు)తో చెలరేగితే మయాంక్ అగర్వాల్ తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా డబుల్ సెంచరీ(215 పరగులు) బాదాడు. ఇలా ఓపెనర్ గా ఆరంగేట్ర టెస్ట్ లోనే రోహిత్ సెంచరీ బాది పలు రికార్డులు నెలకొల్పాడు. ఇదే క్రమంలో తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచిన మయాంక్ ఖాతాలోకి కూడా కొన్ని అరుదైన రికార్డులు వచ్చి చేరాయి.  

వెస్టిండిస్ పర్యటనలో భాగంగా జరిగిన టెస్ట్ సీరిస్ లో మయాంక్ రాణించాడు. దీంతో అతడిపై నమ్మకముంచిన సెలెక్టర్లు స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సీరిస్ కు కూడా ఎంపికచేశారు. అయితే వారి నమ్మకాన్న వమ్ము చేయకుండా వైజాగ్ లో కొనసాగుతున్న మొదటి టెస్ట్ లో  మయాంక్ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇది అతడి టెస్ట్ కెరీర్లోనే మొదటి టెస్ట్.

ఇలా టెస్ట్ క్రికెట్లో మొదటి టెస్ట్ సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచిన మయాంక్. అతడికంటే ఈ ఘనత కేవలం ముగ్గురు భారతీయ క్రికెటర్లు మాత్రమే సాధించారు. మొట్టమొదట 1965 లో దిలీప్ సర్దేశాయ్ ముంబై వేదికన న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత వినోద్ కాంబ్లీ 1993 లో ముంబైలోనే ఇంగ్లాండ్ పై డబుల్ సెంచరీ(224 పరుగులు) బాదాడు. ఆ తర్వాత చాలాకాలంపాటు ఈ రికార్డు వీరిద్దరి పేరిటే పదిలంగా వుంది. 

అయితే 2016 లో చెన్నై వేదికన ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో యువ క్రికెటర్ కరణ్ నాయర్ మొదటి సెంచరీ సాధించాడు. దాన్నే త్రిపుల్ సెంచరీ(303 పరుగులు)గా మలిచి చరిత్ర సృష్టించాడు. తాజాగా ఈ ముగ్గురు ఆటగాళ్ల సరసకు మయాంక్ అగర్వాల్ చేరాడు.  తన కెరీర్లో ఐదో టెస్ట్ ఆడుతున్న మయాంక్ మొదటి సెంచరీని నమోదుచేసుకున్నాడు. దాన్ని డబుల్ సెంచరీగా మలచడం ద్వారా ఈ అరుదైన ఘనత సాధించాడు.