భారత్-సౌతాఫ్రికాల మధ్య విశాఖపట్నంలో గాంధీ జయంతి రోజున (అక్టోబర్ 2) ప్రారంభమైన మొదటి టెస్ట్ ఉత్కంఠభరితంగా సాగుతోంది.  మహాత్మా గాంధీ-నెల్సన్‌ మండేలా ఫ్రీడమ్‌ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కోహ్లీసేన అదరగొడుతోంది. అయితే మంచి ఊపుమీదున్న భారత ఇన్నింగ్స్ భారీ స్కోరుదిశగా సాగుతుండగా వర్షం అడ్డంకి సృష్టించింది.  కోహ్లీసేన వికెట్లేమీ కోల్పోకుండానే 59.1 ఓవర్లలో 202 పరుగుల వద్ద వుండగా వరుణుడు అడ్డుపడ్డాడు. ఎంతకూ వరుణుడు కరుణించకపోవడంతో ఇదే స్కోరు వద్ద మొదటిరోజు ఆట ముగిసింది. 

మొదటిసారి టెస్టుల్లో ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు కేవలం 174 బంతుల్లోనే 12 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. అతడికి మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నుండి చక్కటి సహకారం అందింది. అతడు కూడా 183 బంతుల్లో 11 పోర్లు, 2 సిక్సర్ల సాయంతో 84 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఓపెనర్లిద్దరి విజృంభణతో భారత్ వికెట్లేమీ కోల్పోకుండానే భారి స్కోరు దిశగా ఇన్నింగ్స్ కొనసాగిస్తుండగా ఒక్కసారిగా వర్షం అడ్డుపడింది. 

టీవిరామం అనంతరం కేవలం మొదలైన వర్షం ఎంతకు తగ్గలేదు. దీంతో మొదటిరోజు ఆటను అక్కడే నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇలా మొదటి సగభాగంల భారత్ హవా కొనసాగగా రెండో సగంలో వరుణిడి హవా కొనసాగింది. ఇవాళ్టి ఆటలో ఎక్కడకూడా సఫారీల ఆదిపత్యం కనిపించలేదు. 

సౌతాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్ 11.1 ఓవర్లలో  34, రబడ 13 ఓవర్లలో 35, మహరాజ 23 ఓవర్లలో 66, ఫిడ్త్  7 ఓవర్లలో 43, ముత్తుస్వామి 5 ఓవర్లలె 23 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.