ప్రపంచ కప్ తర్వాత వెస్టిండిస్ పర్యటనను సక్సెస్‌ఫుల్ గా ముగించిన కోహ్లీసేన సొంతగడ్డపై సత్తా చాటేందుకు సిద్దమయ్యింది. గతకొంతకాలంగా వరుసగా విదేశీ  పర్యటనలతో బిజీబిజీగా గడిపిన భారత జట్టు సొంత ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. ఇలా చాలాకాలం తర్వాత సొంత గడ్డపై సౌతాఫ్రికాతో పోరుకు కోహ్లీసేన సిద్దమైంది. అయితే ఇవాళ(ఆదివారం) ధర్మశాల వేదికన జరగాల్సిన మ్యాచ్ కు వర్షం ఆడ్డంకి సృష్టించే అవకాశాలున్నాయని స్థానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో నిర్వహకుల్లోనే కాదు ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ ను వీక్షించాలనుకున్న అభిమానుల్లోనూ ఆందోళన మొదలయ్యింది. 

కొన్నిరోజుల నుండి ధర్మశాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న(శనివారం) కూడా భారీ  అక్కడ వర్షం కురిసింది. ఇదే వాతావరణం ఇవాళ(ఆదివారం)  కూడా కొనసాగే అవకాశాలున్నాయని స్థానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఎడతెరిపి లేకుండా కురవకుండా అప్పుడప్పుడు మాత్రమే జల్లుకు కురిసే అవకాశం
వుందట. దీంతో మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోకుండా కాస్త ఆలస్యంగానైనా ఫలితం తేలే అవకాశాలున్నాయన్నమాట. 

ఇప్పటికే ధర్మశాలలో కురిసన వర్షాలు, ఇవాళ్టి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పిచ్ ప్రవర్తించనుంది. కాబట్టి క్రికెట్ పండితులు సైతం ధర్మశాల పిచ్ పై ఓఅంచనాకు రాలేకపోతున్నాయి. అయితే గతంలో జరిగిన మ్యాచుల మాదిరిగానే పిచ్ ప్రవర్తిస్తే భారీ స్కోర్లు నమోదవనున్నాయి. ఇదే జరిగితే ధనాధన్ ఇన్నింగ్సులతో కూడిన టీ20 క్రికెట్ మజాను అభిమానులు ఆస్వాధించవచ్చు.

గతంలో ఇదే ధర్మశాల మైదానంలో...ఇదే ప్రత్యర్ధిపై రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ మరోసారి చెలరేగితే సఫారీ బౌలర్లు చుక్కలు చూసే అవకాశముంది. అలాగే సౌతాఫ్రికా కెప్టెన్  క్వింటన్ డికాక్ కు కూడా టీమిండియాతో మ్యాచ్ అంటేనే పూనకం వస్తుంటుంది. కాబట్టి అతన్ని భారత బౌలర్లు ఎలా అడ్డుకుంటారో చూడాలి. వీరిద్దరే కాకుండా ఇరుజట్లలోనూ అత్యుత్తమ ఆటగాళ్లున్నారు. కాబట్టి ఈ  మ్యాచ్ లో గెలుపు అవకాశాలు ఇరు జట్లకు సమానంగా వున్నా స్వదేశంలో ఆడటం, మైదానంలో ప్రేక్షకుల మద్దతు  టీమిండియాకు కలిసిరానుంది.