థ్రిల్లర్‌కే అమ్మ మొగుడు లాంటి మ్యాచ్... ఉత్కంఠపోరులో టీమిండియా ఘన విజయం...

ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ సాగిన హై డ్రామా... 4 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత జట్టు... విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్...

India vs Pakistan: Virat Kohli fabulous Innings, team India beats Pakistan

దాయాదుల మధ్య సమరం క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఆధిక్యం చేతులు మారుతూ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ  ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటంతో గత వరల్డ్ కప్‌లో ఎదురైన ప్రతీకారానికి బదులు తీర్చుకుంది.


160 పరుగుల లక్ష్యఛదనలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. 8 బంతుల్లో 4 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, నసీం షా బౌలింగ్‌లో అవుట్ కాగా 7 బంతుల్లో 4 పరుగులు చేసిన రోహిత్ శర్మ, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు....

10 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ కూడా హారీస్ రౌఫ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన అక్షర్ పటేల్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఈ దశలో హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ కలిసి అద్భుతంగా పోరాడారు.


ఆఖరి 5 ఓవర్లలో టీమిండియా విజయానికి 60 పరుగులు రావాల్సి రాగా 16వ ఓవర్ వేసిన హారీస్ రౌఫ్ 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆఖరి 4 ఓవర్లలో ఇండియా విజయానికి 54 పరుగులు కావాల్సి వచ్చాయి. నసీం షా వేసిన 17వ ఓవర్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి...


ఆఖరి 3 ఓవర్లలో 48 పరుగులు కావాల్సి రాగా షాహీన్ ఆఫ్రిదీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 3 ఫోర్లు బాదిన విరాట్ కోహ్లీ, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్‌లో 17 పరుగులు రావడంతో ఆఖరి 2 ఓవర్లలో ఇండియా విజయానికి 31 పరుగులు కావాల్సి వచ్చాయి...

హారీస్ రౌఫ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో మొదటి  4 బంతుల్లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే ఐదో బంతికి సిక్సర్ బాదిన విరాట్ కోహ్లీ, ఆఖరి బంతిని కూడా పెవిలియన్ బయట పడేశాడు. దీంతో ఇండియా విజయానికి ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సి వచ్చాయి...


37 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, ఆఖరి ఓవర్ తొలి బంతికి హార్ధిక్ పాండ్యా భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. రెండో బంతికి కార్తీక్ సింగిల్ తీయగా ఆ తర్వాతి బంతికి 2 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి విరాట్ కోహ్లీ సిక్సర్ బాదాడు. అది నో బాల్ కావడంతో ఆఖరి 3 బంతుల్లో 6 పరుగులు కావాల్సి వచ్చాయి... మహ్మద్ నవాజ్ వైడ్ వేయడంతో 3 బంతుల్లో 5 పరుగులు కావాల్సి వచ్చాయి... 

నాలుగో బంతి వికెట్‌కి తగిలిన వెంటనే విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్ 3 పరుగులు తీశారు. దీంతో ఆఖరి 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సి వచ్చాయి. ఆఖరి ఓవర్ ఐదో బంతికి దినేశ్ కార్తీక్ స్టంపౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆఖరి బంతికి భారత జట్టు విజయానికి 2 పరుగులు కావాల్సి వచ్చాయి...

మహ్మద్ నవాజ్ మరో వైడ్ వేయడంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఆఖరి బంతికి అశ్విన్ ఫోర్ బాది టీమిండియాకి విజయాన్ని అందించాడు.. 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ నాటౌట్‌గా నిలవగా రవిచంద్రన్ అశ్విన్ ఆఖరి బంతికి ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు. 


అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ గోల్డెన్ డకౌట్ కాగా, మహ్మద్ రిజ్వాన్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 15 పరుగులకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది పాకిస్తాన్. 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది పాకిస్తాన్.  

మూడో వికెట్‌కి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇఫ్తికర్ అహ్మద్, 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన షాదబ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

అదే ఓవర్ 4 బంతుల్లో 2 పరుగులు చేసిన హైదర్ ఆలీ కూడా హార్ధిక్ పాండ్యా ఓవర్‌లో ఆఖరి బంతికి సూర్యకుమార్ యాదవ్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 91/2 వద్ద ఉన్న పాకిస్తాన్ స్కోరు, 10 బంతుల వ్యవధిలో 98/5కి చేరుకుంది...

హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన మహ్మద్ నవాజ్, 9 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 4 ఓవర్లలో 30 పరుగులిచ్చిన హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు... 3 బంతుల్లో 2 పరుగులు చేసిన అసిఫ్ ఆలీ, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. షాన్ మసూద్ 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios