India vs Pakistan: భారత్ - పాకిస్తాన్ మధ్య ఆదివారం దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియా కప్ - 2022 రెండో గ్రూప్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది.
భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. దాయాది దేశాల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా అది ఓ చిన్నపాటి యుద్ధమే. ఈ క్రేజ్ ను ప్రసారకర్తలు అందినకాడికి సొమ్ముచేసుకుంటున్నారు. భారత్-పాక్ మ్యాచ్ కు ముందు హైప్ ను తీసుకువచ్చి ఎక్కువ మంది మ్యాచ్ చూడటంలో సఫలీకృతమవుతున్నారు. ఆసియా కప్ - 2022లో భాగంగా ఆదివారం ముగిసిన భారత్ -పాకిస్తాన్ మ్యాచ్ ను ఏకంగా కోటి మందికి పైగా వీక్షించినట్టు సమాచారం.
డిస్నీ హాట్ స్టార్ లో ఇప్పటివరకు 2019లో ముంబై ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో 12 మిలియన్ల వ్యూయర్ షిప్ రికార్డుగా ఉంది. ఇప్పుడు ఇండియా-పాకిస్తాన్ ఆ రికార్డును బ్రేక్ చేసినట్టు తెలుస్తున్నది. ఈ మ్యాచ్ ను ఏకంగా 13 మిలియన్ల (కోటి 30 లక్షల మంది) మంది చూసినట్టు సమాచారం.
డిస్నీ హాట్ స్టార్ లో ఇది రెండో హయ్యస్ట్ వ్యూయర్షిప్. అగ్రస్థానంలో ఆర్సీబీ - ముంబై మధ్య జరిగిన మ్యాచ్ ను 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
- డిస్నీ హాట్ స్టార్ లో నెమ్మదిగా ప్రారంభమైన వ్యూయర్ షిప్ లెక్కలు.. హార్దిక్ పాండ్యా 14వ ఓవర్ తర్వాత పెరిగిపోయాయి. ఆ ఓవర్లో అతడు మహ్మద్ రిజ్వాన్ ను ఔట్ చేయడంతో అప్పటిదాకా 8 మిలియన్లు ఉన్న వ్యూయర్ షిప్.. ఆ తర్వాత 8.7 మిలియన్లకు చేరింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ చివరివరకు వచ్చేసరికి 9.5 మిలియన్లకు తాకింది.
- ఇక భారత్ బ్యాటింగ్ చేసేప్పుడు వ్యూయర్షిప్ 10 మిలియన్లు దాటింది. రోహిత్ - కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో నిదానంగా పెరిగిన వ్యూయర్షిప్.. 17వ ఓవర్ వచ్చేసరికి 12 మిలియన్లకు తాకింది. ఇక చివరి ఓవర్ వచ్చేసరికి 13 మిలియన్ల మార్కు దాటింది.
ఆదివారం నాటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో మహ్మద్ రిజ్వాన్ (43), ఇఫ్తికర్ అహ్మద్ (28) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, హార్ధిక్ పాండ్యా 3, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీయగా అవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. స్వల్పలక్ష్య ఛేదనలో భారత్.. ఆదిలో తడబడింది. తొలి ఓవర్లోనే కెఎల్ రాహుల్ ను నసీం షా డకౌట్ చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ ను కోహ్లీ (35) నిలబెట్టాడు. మిడిల్ లో వచ్చిన రవీంద్ర జడేజా (35)తో కలిసి హార్ధిక్ పాండ్యా (33 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో ఆసియా కప్ లో భారత్ బోణీ కొట్టింది.
