Asianet News TeluguAsianet News Telugu

India vs New Zealand: టాపార్డర్ అట్టర్‌ఫ్లాప్... 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా...

51 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా... ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే మళ్లీ ఫ్లాప్...

India vs New Zealand: Team India lost five Early wickets, Cheteshwar Pujara, Rahane, mayank
Author
India, First Published Nov 28, 2021, 10:49 AM IST

కాన్పూర్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం దక్కించుకున్న టీమిండియాకి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఓవర్‌నైట్ స్కోరు 14/1 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా...51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 49 పరుగుల ఆధిక్యంతో కలిపి టీమిండియాకి ప్రస్తుతానికి 100 పరుగుల లీడ్ మాత్రమే ఉంది. కేల్ జెమ్మీసన్ వేసిన నాలుగో రోజు మొదటి ఓవర్‌లో ఛతేశ్వర్ పూజారా, మయాంక్ అగర్వాల్ చెరో ఫోర్ బాదాడు...

టీమిండియా తాత్కాలిక కెప్టెన్ అజింకా రహానే, తాత్కాలిక వైస్ కెప్టెన్ ఛతేశ్వర్ పూజారా... ఎంతో అనుభవం ఉన్న ఈ ఇద్దరూ సీనియర్లు మరోసారి ఘోరంగా ఫెయిల్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో కాస్తో కూస్తో పరుగులు చేసిన ఈ సీనియర్ ద్వయం, రెండో ఇన్నింగ్స్‌లో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్‌ను రిపీట్ చేశారు.

జెమ్మీసన్ ఓవర్‌లో పూజారా అవుట్ కావడంతో 32 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు. జెమ్మీసన్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌కి అప్పీలు చేసింది న్యూజిలాండ్. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, డీఆర్‌ఎస్ తీసుకున్న కివీస్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది. 

ఆ తర్వాత అజింకా రహానే 15 బంతులాడి 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తాను ఆడిన మొదటి 13 బంతుల్లో పరుగులేమీ చేయలేకపోయిన అజింకా రహానే, 14వ బంతికి ఫోర్ బాది, 15వ బంతికి అజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...

వన్‌డౌన్‌లో సెంచరీ లేకుండా ఛతేశ్వర్ పూజారా 39 ఇన్నింగ్స్‌లు పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో మూడో స్థానంలో ఆడుతూ, సెంచరీ లేకుండా అత్యధిక ఇన్నింగ్స్‌లు ఆడిన ప్లేయర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు ఛతేశ్వర్ పూజారా...

1968 నుంచి 1974 వరకూ అజిత్ వాడేకర్ 39 ఇన్నింగ్స్‌ల పాటు సెంచరీ లేకుండా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయగా, 2019-2021 సీజన్‌లో పూజారా ఈ రికార్డును సమం చేశాడు...

2013-16 సీజన్‌లో 37 ఇన్నింగ్స్‌ల పాటు సెంచరీ లేకుండా గడిపేసిన ‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారా... తన చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు...

2016లో న్యూజిలాండ్‌పై 188 పరుగులు చేసిన కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు చేసిన అజింకా రహానే, ఆ తర్వాత 50 టెస్టుల్లో కేవలం 32.73 సగటుతో పరుగులు చేస్తుండడం విశేషం. 

53 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికే రవీంద్ర జడేజా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...

ఒకే ఓవర్ రెండు వికెట్లు తీసి డబుల్ వికెట్ మెయిడిన్ ఓవర్ వేసిన టిమ్ సౌథీ, టీమిండియాని కోలుకోలేని దెబ్బ తీశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా, బ్యాటింగ్‌కి వస్తాడా? రాదా? అనే విషయంపై స్పష్టత రాలేదు. టీమిండియా సబ్‌స్టిట్యూట్‌గా భరత్‌తో వికెట్ కీపింగ్ చేయించినా, సాహా ఫిట్‌నెస్‌పై స్పష్టత రాకపోవడంతో కంకూషన్‌కి అప్లై చేయలేదు. దీంతో 5 వికెట్లు పడినా, సాహా  రిటైర్డ్ హార్ట్‌గా తేలితే ఆరు వికెట్లు పడినట్టే అవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios