Mohammed Shami : షమీ వికెట్ల సునామీ... ఒక్క మ్యాచ్ లోనే ఇన్ని రికార్డులేంటి భయ్యా...
క్రికెట్ ప్రపంచ కప్ లో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ రికార్డ్స్ క్రియేట్ చేసాడు. అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టిన అతడు భారత్ కు విజయాలను అందించడమే కాదు తనపేరిట రికార్డులను నెలకొల్పుతున్నాడు,
ముంబై : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023 లో టీమిండియా అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. నిన్న వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ను చిత్తుచేసిన రోహిత్ సేన ఫైనల్ కు చేరింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా 50వ సెంచరీ పూర్తిచేసుకున్న విరాట్ కోహ్లీ కంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు మహ్మద్ షమీ. బుల్లెట్ లాంటి బంతులతో న్యూజిలాండ్ బౌలర్లను బెంబేలెత్తించి ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి హీరో అయిపోయాడు షమీ. అతడి అద్భుత బౌలింగ్ ప్రదర్శనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
నిన్నటి సెమీస్ లో 9.5 ఓవర్లలో 57 పరుగులిచ్చిన షమీ ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఇలా న్యూజిలాండ్ ఓటమిని శాసించిన షమీ పేరిట ఎన్నో రికార్డులు క్రియేట్ అయ్యాయి.
షమీ సాధించిన రికార్డులివే :
ఈ వరల్డ్ కప్ లో కేవలం ఆరుమ్యాచులు మాత్రమే ఆడిన షమీ మూడుసార్లు ఐదువికెట్ల ఫీట్ సాధించాడు. న్యూజిలాండ్ పై రెండుసార్లు, శ్రీలంకపై ఒకసారి ఇలా ఐదువికెట్లు పడగొట్టాడు. ఓ ప్రపంచ కప్ లో అత్యధికసార్లు ఐదువికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్ గా షమీ చరిత్ర సృష్టించాడు.
ఇక వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధికసార్లు ఐదువికెట్లు పడగొట్టిన బౌలర్ గా షమీ నిలిచాడు. గత ప్రపంచకప్ లో ఓసారి ఇలాంటి గణాంకాలే సాధించిన షమీ ఈసారి ఏకంగా మూడుసార్లు ఈ ప్రదర్శన చేసాడు. మొత్తంగా వరల్డ్ కప్ చరిత్రలో నాలుగుసార్లు ఐదువికెట్ల ఫీట్ సాధించిన బౌలర్ గా షమీ నిలిచాడు. అంతకుముందు ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట ఈ రికార్డ్ నమోదయి వుంది.
Read More Mohammed Shami: ఏంది సామీ నువ్వు
ఇక వరల్డ్ కప్ టోర్నీలో ఒకే మ్యాచ్ లో ఏడు వికెట్లు పడగొట్టిన ఏకైక భారత బౌలర్ గా షమీ నిలిచాడు. గతంలో స్టువర్ట్ బిన్నీ బంగ్లాదేశ్ పై ఆరు వికెట్లు పడగొట్టాడు... ఇదే ఇప్పటివరకు రికార్డ్. తాజాగా బలమైన న్యూజిలాండ్ పై చెలరేగిన షమీ 7 వికెట్లు పడగొట్టడంతో బిన్నీ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలయ్యింది.
ఇక సెమీ-ఫైనల్‌లో అద్బుత ప్రదర్శనతో వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. భారత పేసర్ తన 17వ వన్డే ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో మైలురాయిని చేరుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డ్ ఆసిస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట వుంది. షమీ కేవలం 795 బంతుల్లో 50 వికెట్లు సాధించగా ఈ ఫీట్ సాధించడానికి స్టార్క్ 941 బంతులు వేయాల్సి వచ్చింది.