గాయంతో తొలి వన్డేకి దూరమైన సీనియర్ స్పిన్నర్ ఇష్ సోదీ... విరాట్ కోహ్లీని త్వరగా అవుట్ చేసేందుకు ప్లాన్స్ సిద్ధం చేశామంటున్న న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్.. 

పాకిస్తాన్‌లో టెస్టు సిరీస్‌ని డ్రా చేసుకున్న న్యూజిలాండ్, వన్డే సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకుని ఇండియాలో అడుగుపెట్టింది. పాక్‌తో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో ఓడిన కివీస్, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆ విజయోత్సహాంతో భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ జట్టు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది...

అయితే టీమిండియాతో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌కి ఊహించిన షాక్ తగిలింది. కివీస్ స్టార్ ప్లేయర్, సీనియర్ స్పిన్నర్ ఇష్ సోదీ గాయంతో హైదరాబాద్ వన్డేకి దూరమయ్యాడు. ఇష్ సోదీ మోకాలి గాయంతో బాధపడుతున్నట్టు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ తెలియచేశాడు...

‘ఇష్ సోదీ గాయంతో బాధపడుతున్నాడు. అతను తొలి వన్డే ఆడడం లేదు. అయితే మిగిలిన మ్యాచుల్లో అతను ఆడతాడనే అనుకుంటున్నా... స్పిన్‌కి అనుకూలించే ఇక్కడ పిచ్‌ల్లో సోదీ సేవలు ఎంతో అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు కివీస్ తాత్కాలిక సారథి టామ్ లాథమ్.. 

పాకిస్తాన్‌ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్ ఆడిన న్యూజిలాండ్, భారత్‌ పర్యటన నుంచి కేన్ విలియంసన్, టిమ్ సౌథీలకు విశ్రాంతి కల్పించింది. ఈ ఇద్దరితో పాటు స్టార్ పేసర్లు మాట్ హెన్రీ, కేల్ జెమ్మిసన్ కూడా గాయాలతో బాధపడుతూ టీమిండియా టూర్‌కి దూరంగా ఉన్నారు...

‘ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, కేన్ విలియంసన్ లేకపోవడం మాకు చాలా పెద్ద దెబ్బే. అయితే వాళ్లు లేకపోయినా కొత్త కుర్రాళ్లు ఈ అవకాశాన్ని చక్కగా వాడుకోవడానికి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడున్న టీమ్‌లో అందరూ ఇంతకుముందు అంతర్జాతీయ క్రికెట్ ఆడినవాళ్లే. అది మాకు అడ్వాంటేజ్...

పాకిస్తాన్ పర్యటనలో వన్డే సిరీస్ గెలిచాం. ఆ విజయంతో ఇండియాలో అడుగుపెట్టడం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇండియాని ఇండియాలో ఓడించడం అంత తేలిక కాదని తెలుసు. అయితే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఇండియాలో ఆడేందుకు ఇదే మాకు ఆఖరి అవకాశం..

ఇక్కడి పిచ్‌లను పూర్తిగా అర్థం చేసుకుని, వరల్డ్ కప్‌కి అవసరమైన వ్యూహాలు రచించేందుకు ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. అందుకే ఈ సిరీస్ ద్వారా వీలైనన్ని పాఠాలు నేర్చుకోవాలని అనుకుంటున్నాం. టీమ్‌లో ఉన్న చాలామంది ఇండియాలో ఆడారు, ఐపీఎల్ కూడా ఆడారు..

విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతను చేసిన రెండు సెంచరీలను చూశాం. అందుకే విరాట్‌ని వీలైనంత త్వరగా అవుట్ చేసేందుకు ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నాం. మా పథకాలను పక్కాగా అమలు చేయాలని అనుకుంటున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు కివీస్ తాత్కాలిక సారథి టామ్ లాథమ్..