Asianet News TeluguAsianet News Telugu

న్యూజిలాండ్ సిరీస్: "తొలి" సిరీస్ విజయమా... మరో ఆస్ట్రేలియా రిపీటా?

ఐదు మ్యాచుల సిరీస్‌లో ఇప్పటికే 2-0తో ముందంజలో నిలిచిన కోహ్లిసేన నేడు హామిల్టన్‌లో నెగ్గి 3-0తో సిరీస్‌ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.  సొంతగడ్డపై భారత్‌ చేతిలో  టి 20 సిరీస్‌ను న్యూజిలాండ్‌ ఇప్పటివరకు కోల్పోలేదు. 

India vs New Zealand, 3rd T20I match preview: team India eyes first series win... fans hounded by australia series history
Author
Hamilton, First Published Jan 29, 2020, 7:41 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వరుసగా ఆక్లాండ్ లో జరిగిన రెండు మ్యాచుల్లో టీం ఇండియా విజయభేరి మోగించింది. తొలి మ్యాచు రసవత్తరంగా సాగితే... రెండో మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా భారత ఆటగాళ్ల ఆధిపత్య ప్రదర్శనలాగా సాగింది. నేడు హామిల్టన్ లో భారత్, కివీస్ ల మధ్య మూడవ మ్యాచ్ మధ్యాహ్నం 12.20 కి ప్రారంభమవనుంది. 

కివీస్ గడ్డపై టీమ్‌ ఇండియా తొలి టీ20 సిరీస్‌ విజయంపై కన్నేసింది. న్యూజిలాండ్ నేలపై గతంలో రెండు పర్యాయాలు టి 20 సిరీస్‌ కోసం పోరాడిన భారత్, ముచ్చటగా మూడో ప్రయత్నంలో విజయానికి అడుగు దూరంలో నిలిచింది. 

ఐదు మ్యాచుల సిరీస్‌లో ఇప్పటికే 2-0తో ముందంజలో నిలిచిన కోహ్లిసేన నేడు హామిల్టన్‌లో నెగ్గి 3-0తో సిరీస్‌ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.  సొంతగడ్డపై భారత్‌ చేతిలో  టి 20 సిరీస్‌ను న్యూజిలాండ్‌ ఇప్పటివరకు కోల్పోలేదు. 

కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలో ఆ జట్టు మరో దారుణ ఓటమి చవిచూసే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. వరుస ఓటములు న్యూజిలాండ్ ను కుంగదీస్తున్న వేళ... న్యూజిలాండ్ భారాన్నంతా మోయాల్సింది ఇప్పుడు కెప్టెన్ విలియమ్సన్ మాత్రమే! టీం లో ముఖ్యమైన పేసర్లు అందుబాటులో లేరనే కారణాన్ని కూడా చూపలేని ఒత్తిడిలో కూరుకుపోయాడు విలియమ్సన్. 

టి 20 ప్రపంచ కప్ కి ముందు సన్నద్ధత, టీం ఇండియా కు ఇదొక కఠిన సవాల్‌ అనుకున్న సిరీస్‌లో కోహ్లిసేన 2-0 ఆధిక్యంలో నిలిచింది. మిగిలిన మూడు మ్యాచుల్లో ఒక్కటి నెగ్గినా, సిరీస్‌ భారత్‌ సొంతమవుతుంది. 

Also read: మూడో టీ20లో మూడు: కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు

గత రెండు పర్యటనల్లో సాధ్యపడని టీ20 సిరీస్‌ విజయం, 2020 టూర్‌లో సాకారం కానుంది. ఇదంతా బాగానే ఉంది, ఇంకా మూడు మచులున్నాయి... బలమైన ఫామ్ లో ఉన్న టీం ఇండియా సునాయాసంగా గెలుస్తుందని భారత అభిమానులంతా ఆశిస్తున్నారు. కాకపోతే ఇక్కడే చరిత్ర రూపంలో మనకో హెచ్చరిక కనబడుతుంది. 

సరిగ్గా ఒక సంవత్సరం క్రితం.... 2019 ఏడాది ఆరంభంలో సైతం భారత్‌ స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఇటువంటి స్థితిలోనే నిలిచింది. 5 మ్యాచుల సిరీస్ లో తొలి రెండు మ్యాచులు నెగ్గి తరువాతి మూడు మ్యాచుల్లో ఒకటైనా నెగ్గలేమా అన్న ధీమాతో ఉంది. 

కానీ ఆ తర్వాత వరుసగా మూడు వన్డేల్లోనూ పరాజయం పాలై, కంగారూలకు వన్డే సిరీస్‌ను సమర్పించుకుంది. ఆ ఓటమి చేదు జ్ఞాపకాలు కెప్టెన్‌ కోహ్లి మదిలో ఇంకా తాజాగానే ఉన్నాయి అనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. 

అందుకే అలసత్వానికి తావులేకుండా హామిల్టన్‌లోనే లాంఛనం ముగించేసి సిరీస్ ఖాతాలో వేసుకోవాలని భారత్‌ ఎదురుచూస్తోంది. ప్రయోగాలకు చోటు లేకుండా అన్ని ఆయుధాలను సంధించేందుకు సిద్ధమవుతోంది. 

మరోవైపు న్యూజిలాండ్‌ సైతం ఇదే పంథాలో ప్రణాళిక రచిస్తోంది. ముఖ్యమైన ఆటగాళ్లంతా సిరీస్ కి ముందే గాయాల కారణంగా అందుబాటులో లేకుండా పోయారు. ఉన్న సీనియర్ ఆటగాళ్లు భారీ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమవుతున్నారు. చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణంలో గెలుపు కోసం పక్కాగా ప్లాన్‌ చేస్తోంది కివీస్ సేన. 

రోహిత్‌ బాకీ తీర్చుకునేనా....?

ఆస్ట్రేలియాపై బెంగళూర్‌ వన్డేలో సెంచరీ కొట్టి మంచి ఊపు మీదున్న రోహిత్ శర్మ.... అదే ఫామ్‌ను కివీస్‌ గడ్డపై కొనసాగించలేకపోతున్నాడు. వరుసగా సిరీస్‌ ఆరంభ మ్యాచుల్లో రోహిత్‌ నిలకడగా విఫలమవుతున్నాడు. 

ఆక్లాండ్‌ టీ20ల్లో రోహిత్‌ రెండెంకల స్కోరు సాధించక మునుపే పెవిలియన్ చేరుకున్నాడు. చిన్న బౌండరీల మైదానాల్లో చెలరేగుతాడని రోహిత్‌పై జట్టు మేనేజ్‌మెంట్‌ భారీ ఆశలు పెట్టుకుంది. 

బంతి ఆలస్యంగా స్వింగ్‌ అయ్యే కివీస్‌ పిచ్‌లపై రోహిత్‌ శర్మ పరుగుల సాధన సిరీస్‌కు ముందు నుంచే ప్రశ్నార్థకంగా నిలిచింది. ఇప్పుడు వరుస మ్యాచుల్లో వైఫల్యం రోహిత్‌ శర్మ సామర్థ్యంపై చర్చ మొదలవుతోంది. 

హామిల్టన్‌లో మెరిసి, కివీస్‌ టూర్‌ను తనదైన శైలిలో మొదలు పెట్టాలని రోహిత్‌ భావిస్తున్నాడు. టాప్‌ ఆర్డర్‌లో కెఎల్‌ రాహుల్‌ కెరీర్‌ టాప్‌ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఒక రకంగా ఇది రాహుల్ కి కెరీర్ పరంగా పర్ పుల్ ప్యాచ్ అని చెప్పొచ్చు.  

మరో ప్రామిసింగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ సైతం నిలకడగా అర్థ సెంచరీలు బాదుతున్నాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టి 20 ఫార్మాట్‌లో దూకుడు మంత్రం జపిస్తున్నాడు. మనీశ్‌ పాండే, శివం దూబె బ్యాట్‌తో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. 

వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు అవకాశం చిక్కటం కష్టమే. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమిలకు తోడుగా నవదీప్‌ సైని మరోసారి పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో కలిసి చాహల్‌ మాయాజాలం కొనసాగించనున్నాడు.

డూ ఆర్ డై.....  

కివీస్ కి ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌. భారత్‌ అగ్ర జట్టుగా ప్రపంచ క్రికెట్ నే శాసిస్తున్నా.. టీ20 ఫార్మాట్‌లో టీమ్‌ ఇండియాపై మెరుగైన రికార్డు మెయింటైన్ చేస్తున్న అరుదైన ఘనత న్యూజీలాండ్ సొంతం. 

సొంతగడ్డపైనే ఆ ఘనతకు ఇప్పుడు ముప్పు వాటిల్లుతోంది. 0-2తో సిరీస్‌లో వెనుకంజ వేసిన న్యూజిలాండ్‌ హామిల్టన్‌లో నెగ్గకుంటే, సిరీస్‌పై కివీస్‌ ఆశలు కోల్పోవాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్‌లో కివీస్‌ మెరుగ్గా రాణించినా, రెండో మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన చేసింది. 

Also read: టీ20 వరల్డ్‌కప్ జట్టును గుర్తించాం: టీమిండియా బ్యాటింగ్ కోచ్ వ్యాఖ్యలు

పొరపాట్లు సరిదిద్దుకోకుంటే కేన్‌ సేన హామిల్టన్‌లో మరో భంగపాటుకు సిద్ధపడక తప్పదు. బ్యాటింగ్‌ లైనప్‌లో కొలిన్‌ డీ గ్రాండ్ హోమ్ కు నం.4 స్థానానికి ప్రమోషన్‌ లభించింది. కానీ రెండు మ్యాచుల్లో 0, 3 పరుగులతో నిరాశపరిచాడు. గ్రాండ్‌ హోమ్ వంటి పించ్ హిట్టర్ కి నాలుగో స్థానం బరువైన స్థానం. 

అతడి నుంచి ఆ ఒత్తిడి సమయంలో కీలక ఇన్నింగ్స్ ని ఆశించడం కష్టం. రాస్‌ టేలర్‌, కేన్‌ విలియమ్సన్‌, కొలిన్‌ మన్రో, మార్టిన్‌ గప్టిల్‌లపైనే న్యూజిలాండ్ ఈ మ్యాచులో తీవ్రంగా ఆధారపడాల్సి ఉంటుంది. 

సాంట్నర్‌, సోధిలు బౌలింగ్ విభాగంలో కీలకం కానున్నారు. బెనెట్‌, టిక్‌నర్‌, సౌథిల పేస్‌ భారత్‌ను ఏ విధంగా నిలువరిస్తుందనేది ఆసక్తికరమైన అంశం. భారత బ్యాట్స్ మెన్ న్యూజిలాండ్ బౌలర్లను చాలా తెలివిగా ఎదుర్కొంటున్నారు.  

పిచ్‌, వెదర్ కండిషన్స్ .... 

ఆక్లాండ్ నుంచి హామిల్టన్ కేవలం ఒక గంటన్నర ప్రయాణం మాత్రమే. ఆక్లాండ్‌ మాదిరిగానే హామిల్టన్‌ సైతం భారీ స్కోరు నమోదయ్యే వేదిక. భారత్‌, కివీస్‌ చివరగా ఇక్కడ ఆడిన మ్యాచ్‌లో 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు సగటున 10 రన్‌రేట్‌తో సునాయాసంగా పరుగులు చేశాయి. నేడు కూడా అదే పద్ధతి కొనసాగనుంది. ఇక్కడ ఫలితం తేలిన చివరి నాలుగు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టునే విజయం వరించింది. 

నేడు మ్యాచ్‌లో ఇరు జట్లు విజయంపై గురి పెట్టాయి. ఒకరేమో సిరీస్ ని చుట్టేయాలని ప్రయత్నిస్తుంటే... మరొకరేమో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచులో విజయం కోసం బరిలోకి దిగుతుంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ చేసేందుకు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువ. 

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా) 

భారత్‌ : రోహిత్‌ శర్మ, రాహుల్‌, కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, మనీశ్‌ పాండే, శివం దూబె, రవీంద్ర జడేజా, షార్దుల్‌ ఠాకూర్‌/నవదీప్‌ సైని, చాహల్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్ బుమ్రా. 

న్యూజిలాండ్‌ : గప్తిల్, కొలిన్‌ మన్రో, కేన్‌ విలియమ్సన్‌, కొలిన్‌ డీ గ్రాండ్‌ హోమ్, రాస్‌ టేలర్‌, టిమ్‌ సీఫర్ట్‌, మిచెల్‌ శాంట్నర్‌, ఇశ్‌ సోధి, టిమ్‌ సౌథి, బ్లెయిర్‌ టిక్‌నర్‌, హామిశ్‌ బెనెట్‌.

Follow Us:
Download App:
  • android
  • ios