Asianet News TeluguAsianet News Telugu

న్యూజిలాండ్‌తో రెండో వన్డే: వర్షం కారణంగా ఆగిన ఆట... ఫలితం తేలడం కష్టమే...

వర్షం కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి 4.5 ఓవర్లలో 22 పరుగులు చేసిన టీమిండియా... మ్యాచ్ రద్దు అయితే సిరీస్‌ ఫలితం తేలడం కష్టమే..

India vs New Zealand 2nd ODI: Rain stops play, Hamilton weather
Author
First Published Nov 27, 2022, 8:48 AM IST

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియాని వరుణుడు వదిలిపెట్టడం లేదు. వర్షాల కారణంగా టీ20 సిరీస్‌ చప్పగా సాగగా మొదటి వన్డే ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగింది. హామిల్టన్‌లో జరుగుతున్న రెండో వన్డేని వరుణుడు వదిలిపెట్టడం లేదు. వర్షం కారణంగా 15 నిమిషాలు టాస్ ఆలస్యమైంది.

టాస్ జరిగిన కొద్దిసేపటికే ఆట ప్రారంభమైంది. అయితే సజావుగా 5 ఓవర్లు కూడా ఆడకముందే మరోసారి వరుణుడు పలకరించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు, వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది...

గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్ 21 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేయగా కెప్టెన్ శిఖర్ ధావన్ 8 బంతుల్లో 2 పరుగులు చేశాడు. వర్షం కారణంగా గంటకు పైగా సమయం నష్టపోకుండా ఒకవేళ మ్యాచ్ తిరిగి ప్రారంభమైనా ఓవర్లను కుదించే అవకాశం ఎక్కువగా ఉంది...

40 ఓవర్లు లేదా అంతకంటే తక్కువ ఓవర్లలో మ్యాచ్‌ని నిర్వహించే అవకాశం ఉంది. వర్షం అంతకంతకీ పెరుగుతుండడంతో మ్యాచ్ సజావుగా జరిగే అవకాశం లేదని డిసైడ్ అయిన అభిమానులు... నిరాశగా స్టేడియం వదిలి బయటికి వెళ్లడం కెమెరాల్లో కనిపించింది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయితే టీమిండియా, వన్డే సిరీస్ ఆశలను వదులుకోవాల్సి ఉంటుంది.

తొలి వన్డేలో ఓడిన భారత జట్టు, మూడో వన్డేలో గెలిస్తే సిరీస్ 1-1 తేడాతో సమం అవుతుంది. క్రిస్ట్‌చర్చిలో జరిగే మూడో వన్డే కూడా వర్షం కారణంగా ఫలితం తేలకపోతే ఆతిథ్య జట్టు వన్డే సిరీస్‌ని దక్కించుకుంటుంది. వర్షం కారణంగా టీ20 సిరీస్‌లో టీమిండియాకి లక్ కలిసి వస్తే.. వన్డే సిరీస్‌లో వరుణుడు న్యూజిలాండ్ జట్టుకి అనుకూలంగా మారాడు.

రెండో వన్డేలో రెండు మార్పులతో బరిలో దిగింది భారత జట్టు. సంజూ శాంసన్ స్థానంలో ఆల్‌రౌండర్ దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చాడు. అలగే శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహార్‌కి తుది జట్టులో చోటు కల్పించింది టీమిండియా. గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమైన దీపక్ చాహార్, నేటి మ్యాచ్ ద్వాారా రీఎంట్రీ ఇస్తున్నాడు... మరోసారి న్యూజిలాండ్ జట్టు ఆడమ్ మిల్నే స్థానంలో మైకెల్ బ్రాస్‌వెల్‌కి తుది జట్టులో చోటు కల్పించింది. 

భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహార్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్

న్యూజిలాండ్ జట్టు: ఫిన్ ఆలెన్, డివాన్ కాన్వే, కేన్ విలియంసన్ (కెప్టెన్), డార్ల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైకెల్ బ్రాస్‌వెల్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లూకీ ఫర్గూసన్

Follow Us:
Download App:
  • android
  • ios