2020 సంవత్సరం ఆరంభం నుండి టీం ఇండియా షెడ్యూల్ చాలా బిజీగా మారిపోయింది. మొన్ననే బెంగళూరులో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగించుకున్న నాలుగు రోజుల్లోనే, ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో టీ20 సమరానికి టీమ్‌ ఇండియా సై అంటోంది. 

భారత్, న్యూజిలాండ్ ల మధ్య 7 గంటల కాలమానం తేడా.  సుదీర్ఘ ప్రయాణం అనంతరం కోహ్లిసేన కివీస్‌ గడ్డపై అడుగుపెట్టింది. 2020 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌పై కన్నేసిన కోహ్లిసేన.. ఆ మెగా ఈవెంట్‌ సన్నద్ధతను దృష్టిలో ఉంచుకుని న్యూజిలాండ్‌తో ఐదు టీ20 సవాల్‌కు సిద్ధంగా ఉంది. 

ఇరు జట్లను కూడా గాయాలు విపరీతంగా వేధిస్తున్నప్పటికీ,  న్యూజిలాండ్ మైదానాల్లో బౌండరీలు చిన్నవి అవడం వల్ల పరుగుల వరద పారడం ఖాయంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ సమరం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.  5 మ్యాచుల సిరీస్ లో తొలి మ్యాచు నేటి మధ్యాహ్నం 12.20 కు ఆక్లాండ్ లో ప్రారంభమవనుంది. 

టి 20 వరల్డ్ కప్ సమీపిస్తుండడంతో మైదానంలో ఆడే ప్రతీ మ్యాచ్‌లో కూడా టీమ్‌ ఇండియా ధ్యాస టీ20 వరల్డ్‌కప్‌పైనే కనిపిస్తోంది. న్యూజిలాండ్‌ పర్యటన అందుకు ఎంతమాత్రం మినహాయింపు కాదు. 

ప్రపంచకప్‌ విజయాన్ని ధ్యేయంగా పెట్టుకున్న కోహ్లిసేన 2020 సెప్టెంబర్‌లో వరల్డ్‌కప్‌ నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా కండిషన్స్, న్యూజిలాండ్ కండిషన్స్ దాదాపుగా దగ్గరగా ఉంటాయి. అందుకే న్యూజిలాండ్‌ పిచ్‌లపై వరల్డ్‌కప్‌ ఫైట్ కోసం రిహార్సల్స్ గా పనికొస్తుందని భావిస్తోంది. 

వరల్డ్‌కప్‌ ప్రణాళికల్లో భాగంగానే న్యూజిలాండ్‌తో ఐదు టీ20 సిరీస్‌ ఆడుతోంది టీం ఇండియా. గాయాలు ఇరు జట్ల తుది కూర్పును గట్టి దెబ్బ తీశాయి. శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌ పాండ్య, దీపక్‌ చాహర్‌లు లేకుండా భారత్‌ బరిలోకి దిగుతుండగా.... మేటి బౌలర్లు మాట్‌ హెన్రీ, ట్రెంట్‌ బౌల్ట్‌, లాకీ ఫెర్గుసన్‌ వంటి సీమర్ల సేవలు లేకుండానే కివీస్‌ మైదానంలోకి అడుగుపెడుతుంది. 

ఆస్ట్రేలియా చేతిలో 0-3 తో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ ఓటమితో నాయకుడిగా అవమాన భారంతో, ఒకింత ఒత్తిడిలో కొనసాగుతున్న కేన్‌ విలియమ్స్‌ సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో ఎలాగైనా గెలిచితీరాలని కసితో తన జట్టును సన్నద్ధం చేస్తున్నాడు. 

భారత బౌలర్ల వైవిధ్యంపైన్నే.... 

భారత్‌తో సిరీస్‌కు న్యూజిలాండ్‌ మంచి పచ్చిక కలిగిన పిచ్‌లను సిద్ధం చేసింది. పచ్చికపై బంతులేయటం, మంచి స్వింగ్‌ రాబట్టి బ్యాట్స్‌మెన్‌ను ఇరుకున పెట్టడం బౌలర్లకు మంచి బిర్యానీ తిన్నంత ఆనందంగా ఉంటుంది. కాకపోతే స్వింగ్ దొరికినప్పటికీ.... న్యూజిలాండ్‌ పిచ్‌లపై మరో కఠిన సవాల్‌ కూడా ఎదురు కానుంది. 

ఆక్లాండ్‌ లోని బౌండరీ లెంగ్త్ చాలా తక్కువ. స్ట్రెయిట్ లెంగ్త్ బౌండరీ డిస్టెన్స్ అయితే చాలా చిన్నది. ఒక రకంగా మన గల్లీ క్రికెట్ బౌండరీ లెంగ్త్ కూడా పోల్చొచ్చు. ఓవర్‌లోని ఆరు బంతులకు వేర్వేరు లైన్ అండ్ లెంగ్త్ తో వైవిధ్యం చూపిస్తూ... స్వింగ్‌ రాబట్టాలి. 

అప్పుడు మాత్రమే బ్యాట్స్‌మెన్‌ నేరుగా ఆడేందుకు వీలు చిక్కకుండా బంతులేయాగాల ఆస్కారం ఉంటుంది. 30 యార్డ్‌ల సర్కిల్‌ను గనుక బంతి దాటితే అది బౌండరీని దాదాపుగా చేరుకున్నట్టే. 

బ్యాట్స్‌మెన్‌ షాట్స్ ఎక్కువగా టాప్‌ ఎడ్జ్‌ తీసుకునేలా ఎంతో తెలివితో బౌలింగ్‌ చేయాలి. చాలాసార్లు బిగ్ హిట్టర్స్ కొట్టే బంతులు టాప్ ఎడ్జ్ తీసుకున్నప్పటికీ అవి చాలా తేలికగా ఫెన్స్ దాటుతుంటాయి. కాబట్టి బౌలర్లు పేస్ ని కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలిసి ఉంటుంది. 

జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, షార్దుల్‌ ఠాకూర్‌ సహా స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాలు స్వదేశంలో ఆసీస్‌కు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కానీ న్యూజీలాండ్ లో ఆ ప్రదర్శన కనుక కొనసాగిస్తే ప్రయోజనం ఉండదు. 

చిన్న బౌండరీలైనా ఆక్లాండ్‌లో స్పిన్నర్లకు అదనపు అనుకూలత ఉంటుంది. కుల్దీప్‌ యాదవ్‌, జడేజాలు ఈ అనుకూలతను సద్వినియోగం చేసుకుంటే భారత్‌కు గొప్ప ఉపశమనం ఉంటుంది. 

బ్యాటింగ్‌ లైనప్‌లో ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌ దూరమైనా, భారత్‌కు ఎటువంటి ఇబ్బంది లేదు. రోహిత్‌ శర్మ, కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లిలతో టాప్‌ ఆర్డర్‌ అత్యంత పటిష్టంగా ఉంది. కొత్త బంతిని నేర్పుగా ఎదుర్కొంటే పరుగుల వరద పారించే సత్తా టాప్‌-3 సొంతం. 

శ్రేయస్ అయ్యర్‌, మనీశ్‌ పాండే, జడేజా/దూబెలలో ఒకరు మిడిల్‌ ఆర్డర్‌లో రానున్నారు. అయ్యర్‌ టీ20కి అవసరమైన ఇన్నింగ్స్ లు ఈ మధ్య ఆడటంతో విఫలమవుతున్నాడు. అయ్యర్ ఒకింత ఈ తరహా ఆటతీరు కనబర్చాల్సిన సమయం ఇది. 

ఇక మరో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్, మనీశ్‌ పాండేకు ఇక్కడ తన బలనిరూపణకు మరో అవకాశం దొరకనుంది. పవర్‌ ప్లేలో స్పిన్‌ బౌలర్‌ అవసరం అనుకుంటే వాషింగ్టన్‌ సుందర్‌ సైతం తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. కెఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు తీసుకోవటంతో.. రిషబ్‌ పంత్‌కు, సంజు శాంసన్ కి తుది జట్టులో చోటు లభించటం కష్టం.

సొంతగడ్డపై కివీస్ మెరిసినా...?

ఆసీస్‌కు టెస్టు సిరీస్‌ 0-3తో కోల్పోయినా స్వదేశంలో కివీస్‌కు ఘనమైన రికార్డుంది. పొట్టి ఫార్మాట్‌లో శ్రీలంకపై 2-1 విజయం, ఇంగ్లాండ్‌తో 2-2తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సమంగా పంచుకుంది. 

గాయాల బెడద డ్రెస్సింగ్‌రూమ్‌లో ఆందోళన కలిగించినా, నాణ్యమైన ఆల్‌రౌండర్లు న్యూజిలాండ్‌ తుది జట్టు కూర్పును ఎప్పుడూ బలంగానే ఉంచుతారు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, సీనియర్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌లు న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ భారం మోయనున్నారు. 

స్వదేశంలో ఎటువంటి బౌలింగ్‌ బృందానైన్నా వేటాడే ఆటగాడు విలియమ్సన్‌. కివీస్‌ పిచ్‌లపై విలియమ్సన్‌ను అడ్డుకోవటం భారత బౌలర్లకు పరీక్ష. హిట్టర్లు గప్టిల్‌, టేలర్‌లు తమదైన భారీ ఇన్నింగ్స్‌లతో పూడ్చుకోలేని నష్టం చేయగలరు. 

ఆల్‌రౌండర్లు స్కాట్‌, కొలిన్‌ మన్రో, మిచెల్‌ శాంట్నర్‌, కొలిన్‌ డీ గ్రాండ్‌హౌమెలు కీలకం కానున్నరు. వికెట్‌ కీపర్‌, ఫ్యూచర్ స్టార్ గా అందరూ కీర్తిస్తున్న టిమ్‌ సీఫర్ట్‌ సత్తా చాటేందుకు ఎదురుచూస్తుండగా, ఇశ్‌ సోధి, టిమ్‌ సౌథి ఆక్లాండ్‌ పరిస్థితుల్లో ప్రభావం చూపించగలరు. 

పిచ్‌, వెదర్ కండిషన్స్.... 

ఆక్లాండ్‌ లోని ఈడెన్‌పార్క్‌ బ్యాట్స్‌మెన్‌ స్వర్గధామం. చిన్న బౌండరీల మైదానం. ఎటువంటి బ్యాట్స్‌మెన్‌ అయినా, హిట్టింగ్‌ చేయడానికి సాహసించే గ్రౌండ్‌ ఇది. బౌలర్లు ఎప్పటికప్పుడు లెంగ్త్‌, లైన్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. 

అక్కడి ఉపఉష్ణమండల పరిస్థితుల్లో స్లో, స్పిన్‌ బౌలర్లకు అనుకూలత ఎక్కువ. ఇరు జట్లు పేసర్లతో పాటు స్పిన్‌పై ఎక్కువగా ఆధారపడనున్నాయి. లక్ష్యాన్ని కాపాడుకోవటం కష్టమైన పని. 

టాస్‌ నెగ్గిన తొలుత బౌలింగ్‌ చేసేందుకు మొగ్గచూపనుంది. సాయంత్రం ఆక్లాండ్‌లో మోస్తరు చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షం అంతరాయం కలిగించినా, కనీసం కుదించిన ఓవర్లతోనైనా మ్యాచ్‌ ఆడేందుకు అవకాశం ఎక్కువ. ఇక్కడ ఓవర్‌కు 10కి పైగా పరుగులు రాబట్టడం పెద్ద కష్టమైనా పని కాదు. 

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా) 

భారత్‌ : రోహిత్‌ శర్మ, కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, మనీశ్‌ పాండే, శివం దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్‌ సైని. న్యూజిలాండ్‌ : మార్టిన్‌ గప్టిల్‌, కొలిన్‌ మన్రో, కేన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌, టామ్‌ బ్రూస్‌, స్కాట్‌ కుగ్లిజిన్‌, టిమ్‌ సీఫర్ట్‌, కొలిన్‌ డీ గ్రాండ్‌హౌమె, టిమ్‌ సౌథీ, ఇశ్‌ సోధి, మిచెల్‌ శాంట్నర్‌.