తొలి వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం జోడించిన నేపాల్ ఓపెనర్లు... మొదటి 5 ఓవర్లలోనే 3 క్యాచులు డ్రాప్ చేసిన టీమిండియా ఫీల్డర్లు.. 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు తమపై ఉన్న అంచనాలను పూర్తిగా తగ్గించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది భారత జట్టు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ కాగా నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలు తేలిపోయాయి..

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నేపాల్ 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ముందు నేపాల్ బ్యాటర్లు నిలవడం కష్టమేనని అనుకున్నారంతా. అయితే భారత ఫీల్డింగ్ తప్పిదాలను కరెక్టుగా వాడుకుంటూ నేపాల్ ఓపెనర్లు ఇద్దరూ 9.5 ఓవర్ల పాటు వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశారు..

మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో ఆఖరి బంతికి కుశాల్ బుర్టెల్ ఇచ్చిన క్యాచ్‌ని స్లిప్‌లో శ్రేయాస్ అయ్యర్ జారవిడిచాడు. ఆ తర్వాత మమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆసిఫ్ షేక్ ఇచ్చిన క్యాచ్‌ని విరాట్ కోహ్లీ నేలపాలు చేశాడు. చేతుల్లో పడిన క్యాచ్‌ని అందుకోవడంలో కోహ్లీ విఫలం కావడంతో ఆసిఫ్ షేక్‌కి లైఫ్ లభించింది..

ఆ తర్వాత మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో కుశాల్ బుర్టెల్ ఇచ్చిన క్యాచ్‌ని ఇషాన్ కిషన్ వదిలేశాడు. కుశాల్ బ్యాటు అంచుని తాకుతూ వెళ్లిన బంతి, ఇషాన్ కిషన్ గ్లవ్స్‌ని తాకుతూ బౌండరీకి దూసుకెళ్లింది.. ఈ మూడు ఛాన్సులను వాడుకుంటూ ఓపెనర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు..

హార్ధిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో మొదటి బంతికి కుశాల్ బుర్టెల్ అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు. అయితే డీఆర్‌ఎస్ తీసుకున్న నేపాల్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో సిక్సర్ బాదిన కుశాల్ బుర్టెల్, ఆ తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు.

తొలి వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత తొలి వికెట్ కోల్పోయింది నేపాల్. 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన కుశాల్ బుర్టెల్, ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టీమిండియా సో కాల్డ్ టాప్ క్లాస్ బౌలింగ్ అటాక్‌ని ఎదుర్కొంటూ మొదటి 10 ఓవర్లలో 65 పరుగులు చేసింది నేపాల్... నేపాల్ జట్టు, టీమిండియాని ఎదుర్కోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.