Asianet News TeluguAsianet News Telugu

అదరగొట్టిన తెలుగమ్మాయి సబ్బినేని మేఘన... మలేషియా ముందు భారీ టార్గెట్...

20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసిన భారత జట్టు... 69 పరుగులు చేసి అవుటైన టీమిండియా ఓపెనర్ సబ్బినేని మేఘన...

India vs Malaysia Asia cup 2022: Sabbineni Meghana scores half century, Team India womens
Author
First Published Oct 3, 2022, 2:42 PM IST

వుమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీలో నేడు భారత మహిళా జట్టు, మలేషియాతో తలబడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. మొదటి మ్యాచ్‌లో శ్రీలంకపై భారీ విజయం అందుకున్న టీమిండియా, మలేషియాతో మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలో దిగింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధానకి రెస్ట్ ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్, తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘనకి ఓపెనర్‌గా అవకాశం కల్పించింది. 

షెఫాలీ వర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన సబ్బినేని మేఘన, టీమిండియాకి అదిరిపోయే ఆరంభాన్ని అందించింది. 53 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 69 పరుగులు చేసిన సబ్బినేని మేఘన, టీ20 కెరీర్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ నమోదు చేసింది... తొలి వికెట్‌కి 116 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత మేఘన అవుటైంది.

టీమిండియా తరుపున 3 వన్డేలు, 12 టీ20 మ్యాచులు ఆడిన సబ్బినేని మేఘన, ఆంధ్రపద్రేశ్‌లో కృష్ణా జిల్లాలో 1996లో జన్మించింది. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ కారణంగా ఎక్కువగా రిజర్వు బెంచ్‌కే పరిమితమవుతున్న మేఘన... రాక రాక వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకుంది.. 

39 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసిన షెఫాలీ వర్మ, నూర్ దనియా సుహెడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. కిరణ్ నవ్‌గిరే డకౌట్ కాగా రాధా యాదవ్ 4 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ 19 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా దయాలన్ హేమలత 4 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసింది...

శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న భారత మహిళా జట్టు, తర్వాతి మ్యాచ్‌లో యూఏఈతో తలబడుతుంది. బంగ్లాదేశ్ వుమెన్స్ జట్టు, థాయిలాండ్‌పై 9 వికెట్ల తేడాతో విజయం అందుకోగా పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది మలేషియా...

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం అందుకున్న పాకిస్తాన్, పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే భారత మహిళా జట్టు, పాకిస్తాన్‌ని వెనక్కి నెట్టి టేబుల్ టాప్ పొజిషన్‌లోకి వెళ్తుంది..

Follow Us:
Download App:
  • android
  • ios