LEIC vs IND: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు లీసెస్టర్షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ను ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్ లో రిషభ్ పంత్ తో పాటు పలువురు ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు తరఫున ఆడుతున్నారు. 

ఇంగ్లాండ్ తో గతేడాది మిగిలిపోయిన ఐదో టెస్టును ఆడేందుకు యూకేలో ఉన్న భారత జట్టు.. లీసెస్టర్షైర్ తో 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నది. లీసెస్టర్షైర్ లోని గ్రేస్ రోడ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పలు ఆసక్తకిర అంశాలున్నాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారాతో పాటు రిషభ్ పంత్, స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ లు భారత్ తో కాకుండా ప్రత్యర్థి జట్టు తరఫున ఆడతుండటం విశేషం. ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ భారత జట్టు లోని కీలక ఆటగాళ్లంతా ఈ మ్యాచ్ ఆడుతున్నారు. 

కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లతో పాటు హనుమా విహారి క్రీజులో నిలువలేకపోయారు. 47 బంతులాడిన రోహిత్ శర్మ.. 3 ఫోర్లతో 25 రన్స్ చేశాడు. రోమన్ వాకర్ బౌలింగ్ లో అతడు అబిడినే కు క్యాచ్ ఇచ్చాడు. 

శుభమన్ గిల్.. 28 బంతుల్లో 21 పరుగులు చేసి 4 ఫోర్లు కొట్టి దాటిగా ఆడుతున్నట్టే కనిపించినా అతడు కూడా విలి డేవిస్ బౌలింగ్ లో రిషభ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వన్ డౌన్ లో వచ్చిన హనుమా విహారి (3) కూడా రోమన్ వాకర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (0) ప్రసిధ్ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి (4 నాటౌట్), రవీంద్ర జడేజా (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 22 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఇదిలాఉండగా ఇంగ్లాండ్ తో ఐదో టెస్టుకు ముందు అందరికీ ప్రాక్టీస్ కావాలనే ఉద్దేశంతో పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లందరినీ ఆడిస్తున్నారు. దాంతో రిషభ్ పంత్, పుజారా, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ లు లీసెస్టర్షైర్ తరఫున బరిలోకి దిగారు. భారత జట్టులో శ్రీకర్ భరత్ వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్నాడు.

Scroll to load tweet…

- ఈ మ్యాచ్ ను ఇంగ్లాండ్ కౌంటీ అఫిషియల్ ఛానెల్ అయిన ‘ఫాక్సెస్‌ టీవీ’లో ఉచితంగా వీక్షించొచ్చు.

జట్లు : 

లీసెస్టర్షైర్ : సామ్యూల్‌ ఈవన్స్‌(కెప్టెన్‌), లూయీస్‌ కింబర్‌, పుజారా, రిషభ్‌ పంత్‌, రేహాన్‌ అహ్మద్‌, సామ్యూల్‌ బేట్స్‌ (వికెట్‌ కీపర్‌), రోమన్‌ వాకర్‌, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, విల్‌ డేవిస్‌, నాథన్‌ బౌలే, అబిడినే సకాండే, జోయ్‌ ఎవిసన్‌

ఇండియా : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, విరాట్‌ కోహ్లి, హనుమ విహారి, శ్రీకర్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌.