తొలి రోజు ఆటలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసిన టీమిండియా, రెండో రోజు బ్యాటింగ్ చేయకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్... పూజారాని క్లీన్‌బౌల్డ్ చేసిన మహ్మద్ షమీ...
పూజారా వికెట్ తీసిన మహ్మద్ షమీ... ఐపీఎల్‌లో కూడా ఇలాంటి సీన్ చూడడం కష్టమే, ఎందుకంటే టెస్టు ప్లేయర్ పూజారాకి ఐపీఎల్‌లో చోటు దక్కినా, తుదిజట్టులో ప్లేస్ దక్కడం దాదాపు అసాధ్యమే. అయితే వార్మప్ మ్యాచ్‌లో ఈ అరుదైన సంఘన ఆవిష్కృతమైంది. గత మూడేళ్లుగా సెంచరీ చేయలేక, టీమ్‌లో చోటు కోల్పోయిన టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, ఇంగ్లాండ్ టూర్ వార్మప్ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఐదో టెస్టు ఆరంభానికి ముందు జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా తరుపున కాకుండా లీస్టర్‌షైర్ తరుపున బరిలో దిగుతున్నాడు ఛతేశ్వర్ పూజారా...
తుదిజట్టులో లేని ప్లేయర్లకు కూడా కావాల్సినంత ప్రాక్టీస్ దక్కాలనే ఉద్దేశంతో ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రిత్ బుమ్రాలను లీస్టర్‌షైర్ కౌంటీ టీమ్‌లో చోటు కల్పించారు. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసిన భారత జట్టు, రెండో రోజు బ్యాటింగ్ చేయకుండానే ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించింది...
కెప్టెన్ రోహిత్ శర్మ 47 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసి అవుట్ కాగా శుబ్‌మన్ గిల్ 28 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. హనుమ విహారి 23 బంతుల్లో 3 పరుగులు చేయగా శ్రేయాస్ అయ్యర్ 11 బంతులాడి డకౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా 13 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 69 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
శార్దూల్ ఠాకూర్ 6 పరుగులు చేసి అవుట్ కాగా ఉమేశ్ యాదవ్ 32 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. శ్రీకర్ భరత్ 111 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 70 పరుగులు, మహ్మద్ షమీ 26 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు...
లీస్టర్‌షైర్ బౌలర్ రోమన్ వాకర్ 5 వికెట్లు తీయగా విల్ డేవిస్ 2 వికెట్లు తీశాడు. భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఓ వికెట్ తీశాడు. కౌంటీల్లో బీభత్సమైన ఫామ్‌తో నాలుగు సెంచరీలు, అందులో రెండు డబుల్ సెంచరీలు బాదిన ఛతేశ్వర్ పూజారా... వార్మప్ మ్యాచ్‌లో మాత్రం చేతులు ఎత్తేశాడు. భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో పూజారా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు లీస్టర్‌షైర్ కెప్టెన్ శామూల్స్ ఈవెన్స్‌ని 1 పరుగుకే పెవిలియన్ చేర్చిన మహ్మద్ షమీ, 6 బంతులాడి పరుగులేమీ చేయలేకపోయిన పూజారాని అవుట్ చేసిన తర్వాత, అతనిపై చేతులు వేసి ఏదో మాట్లాడుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు...
39 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేసిన ఓపెనర్ లూయిస్ కింబర్‌ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేయగా 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది లంకాషైర్ క్లబ్. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్రీజులో ఉన్నాడు.
