టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా... రింకూ సింగ్ అంతర్జాతీయ ఆరంగ్రేటం.. టీ20ల్లో ప్రసిద్ధ్ కృష్ణ..
ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 14 నెలల తర్వాత జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వబోతుండడంతో అతనిపైనే అందరి ఫోకస్ ఉంది. టీ20ల్లో టీమిండియాకి కెప్టెన్సీ చేస్తున్న మొట్టమొదటి స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా..
ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ముగ్గురిలో ఒక్కరు కూడా తుది జట్టులో లేకుండా జస్ప్రిత్ బుమ్రా మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, సభ్యుడిగా ఉన్నాడు..
2022 నుంచి టీమిండియాకి టీ20ల్లో ఐదో కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా. 2022 జనవరి నుంచి రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్.. టీ20ల్లో కెప్టెన్లుగా వ్యవహరించారు. ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో టీ20 మ్యాచులు ఆడనుంది భారత జట్టు. గత ఏడాదిన్నరలో ఏ జట్టు కూడా ఇంతమంది కెప్టెన్లను మార్చలేదు..
ఐర్లాండ్ పేరుకి చిన్న జట్టే అయినా ఇంగ్లాండ్ వంటి టాప్ టీమ్స్‌కి చుక్కలు చూపించిన చరిత్ర దానికి ఉంది. గత పర్యటనలోనూ ఐర్లాండ్, టీమిండియాకి దాదాపు షాక్ ఇచ్చినంత పని చేసింది. దీపక్ హుడా సెంచరీలతో టీమిండియా 225 పరుగుల భారీ స్కోరు చేస్తే, ఆ లక్ష్యఛేదనలో 221 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో పోరాడి ఓడింది ఐర్లాండ్..
ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్, నేటి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్నాడు. అలాగే గాయంతో ఏడాదిగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న ప్రసిద్ధ్ కృష్ణ, నేటి మ్యాచ్ ద్వారా టీ20 ఆరంగ్రేటం చేస్తున్నాడు...
ఆసియా క్రీడల్లో భారత జట్టును నడిపించబోయే రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయబోతున్నాడు. సంజూ శాంసన్‌కి వికెట్ కీపర్‌గా చోటు దక్కింది. అతను వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చే అవకాశం ఉంది. రింకూ సింగ్, శివమ్ దూబేలతో పాటు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు..
అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రాతో ఫాస్ట్ బౌలర్లుగా వ్యవహరించబోతుంటే రవి భిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్లుగా ఉన్నారు. ప్రస్తుత భారత జట్టులో జస్ప్రిత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, సంజూ శాంసన్ తప్ప మిగిలిన ప్లేయర్లకు 20 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడిన అనుభవం కూడా లేదు...
భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా (కెప్టెన్), రవి భిష్ణోయ్
ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బాల్బరిన్, లోర్కన్ టక్కర్, హారీ టెక్కర్, కర్టీస్ కాంపర్, జార్జ్ డాక్‌రెల్, మార్క్ అదైర్, బారీ మెక్‌కార్తీ, క్రెగ్ యంగ్, జోషువా లిటిల్, బెంజిమన్ వైట్
