టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి... మన దేశంతోపాటు... ఇతర దేశాల్లోనూ అభిమానులు ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పక్కన పెడితే.. కోహ్లీ కి చాలా కోపం ఎక్కువ అని చాలా మంది భ్రమపడుతుంటారు. అయితే.. కోహ్లీ ఆటలో కోపంగా ఉన్నా.. బయట చాలా జోవియల్ గా ఉంటారు. 

సహచర ఆటగాళ్లను ఆటపట్టించడంలోనూ కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడు. తన చిలిపి పనులతో నవ్వులు పూయిస్తుంటాడు. సహచరులపై జోక్‌లు పేలుస్తూ వారిని అనుకరించే కోహ్లీ.. అప్పుడప్పుడూ ప్రత్యర్థి టీమ్ ఆటగాళ్లనీ కూడా సరదాగా ఆటపట్టిస్తుంటాడు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి భారత్-ఇంగ్లండ్ మధ్య బుధవారం ప్రారంభం అయిన డేనైట్ టెస్ట్ మ్యాచ్‌కు ముందు చోటుచేసుకుంది. 

 

తన సమఉజ్జీ అయిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ స్టైల్ ని అనుకరించాడు. డేనైట్ టెస్ట్ మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన విరాట్ కోహ్లీ.. సరదాగా స్టీవ్ ‌స్మిత్‌ని అనుకరిస్తూ కనిపించాడు. షాట్ ఆడిన తర్వాత చేతులతో బ్యాట్ ఊపుతూ స్మిత్‌ని టీజ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

స్టీవ్ ‌స్మిత్ బ్యాటింగ్ శైలి పూర్తి భిన్నంగా ఉంటుంది. క్రీజులో స్టాన్స్ తీసుకునే దగ్గర నుంచి.. షాట్ ఆడిన తర్వాత అతను ఇచ్చే రియాక్షన్ ఫన్నీగా ఉంటాయి. బ్యాట్, చేతులు, కాళ్లతో ఒకరకమైన విన్యాసాలు చేస్తుంటాడు. బంతిని ఆడకుండా వదిలేసేందుకు ఓ సెపరేట్ స్టైల్ మెయింటైన్ చేస్తాడు. ఫాస్ట్ బౌలర్లని రెచ్చగొట్టి వారి లయని దెబ్బతీసేందుకు ‌స్మిత్ క్రీజు వెలుపలికి వచ్చి బంతిని డిఫెన్స్ చేస్తూ.. అదోరకమైన హావభావాల్ని ప్రదర్శిస్తుంటాడు. అవన్నీ కూడా ఫన్నీగా ఉంటాయి. సేమ్ అలాగే ఇప్పుడు కోహ్లీ చేయడం గమనార్హం.