శ్రేయాస్ అయ్యర్ కూడా అవుట్... 15 ఓవర్లలో 50 పరుగులు! లక్నోలో కష్టపడుతున్న టీమిండియా బ్యాటర్లు..
ICC World cup 2023: 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ అట్టర్ ఫ్లాప్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా, లక్నోలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పరుగులు చేయడానికి తెగ కష్టపడుతోంది. 15 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 15 పరుగులు మాత్రమే చేయగలిగింది భారత జట్టు..
టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, నెమ్మదిగా ఇన్నింగ్స్‌ని ఆరంభించింది. డేవిడ్ విల్లే వేసిన మొదటి ఓవర్‌లో రోహిత్ శర్మ పరుగులేమీ చేయలేదు. మెయిడిన్ ఓవర్‌తో మ్యాచ్‌ని మొదలెట్టింది టీమిండియా. రెండో ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ ఫోర్ బాదాడు. డేవిడ్ విల్లే వేసిన మూడో ఓవర్‌లో 4, 6, 1, 1, 6 బాది 18 పరుగులు రాబట్టాడు రోహిత్ శర్మ. ఆ తర్వాతి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది టీమిండియా..
13 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 26 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాతి ఓవర్‌లో 1 పరుగు మాత్రమే రాగా క్రిస్ వోక్స్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ కూడా మెయిడిన్‌గా ఇచ్చాడు రోహిత్ శర్మ..
మొదటి 9 బంతుల్లో పరుగులేమీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ.. డేవిడ్ విల్లే బౌలింగ్‌లో షాట్‌కి ప్రయత్నించి బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ కావడం ఇదే తొలిసారి..
విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇది 34వ డకౌట్. అత్యధిక సార్లు డకౌట్ అయిన టాపార్డర్ బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ. 16 బంతుల్లో 4 పరుగులు చేసిన శ్రేయా్ అయ్యర్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మార్క్ వుడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. భారత జట్టు మొదటి పవర్ ప్లే 10 ఓవర్లలోనే 3 మెయిడిన్లు ఇవ్వడం విశేషం. మార్క్ వుడ్ వేసిన మొదటి ఓవర్‌లో రోహిత్ శర్మ అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించినా, రివ్యూ తీసుకున్న టీమిండియాకి అనుకూలంగా ఫలితం దక్కింది..
రివ్యూలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు క్లియర్‌గా కనిపించింది. ఆ తర్వాతి బంతికి ఫోర్ బాదాడు రోహిత్ శర్మ. 16 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది భారత్..