ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్... జో రూట్ వికెట్ తీసేందుకు సిరాజ్‌కి సలహా ఇచ్చిన విరాట్ కోహ్లీ... 

కొందరు బౌలర్లు, కొందరు కెప్టెన్ల కెప్టెన్సీలోనే బాగా ఆడతారు... ఎమ్మెస్ ధోనీ వికెట్ కీపర్‌గా ఉన్నంతకాలం అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, మాహీ రిటైర్మెంట్ తర్వాత వికెట్లు తీయడానికి చాలా కష్టపడి టీమ్‌లో ప్లేస్ కూడా కోల్పోయాడు. అలాగే ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ గైడెన్స్‌లో అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి, ఇప్పుడు మహ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే స్టార్ బౌలర్‌గా మారాడు...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లలో ఆరంగ్రేటం చేసిన మహ్మద్ సిరాజ్... టెస్టులో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తూ భారత జట్టుకి ప్రధాన బౌలర్‌గా మారిపోయాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేకి ముందు జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో అతని స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు మహ్మద్ సిరాజ్...

Scroll to load tweet…

రెండో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన మహ్మద్ సిరాజ్... మూడు బంతులాడి పరుగులేమీ చేయలేకపోయిన జానీ బెయిర్‌స్టని డకౌట్ చేశాడు. ఆ తర్వాత మూడు బంతులాడిన జో రూట్ కూడా సిరాజ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. 

టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ క్రీజులో ఉండగానే సిరాజ్ దగ్గరికి వచ్చి, జో రూట్‌కి ఎలా బౌలింగ్ వేయాలో సూచనలు చేశాడు విరాట్ కోహ్లీ... మాజీ కెప్టెన్ చెప్పిన సూచనలను తూ.చ తప్పకుండా పాటించిన మహ్మద్ సిరాజ్... స్లిప్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

జో రూట్ అవుటైన తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు మహ్మద్ సిరాజ్. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడే హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీ ఇచ్చిన సపోర్ట్‌ గురించి చాలా సార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే...

తాను సాధించిన సక్సెస్‌లో ఎక్కువ శాతం క్రెడిట్ విరాట్ కోహ్లీకే దక్కుతుందంటూ వ్యాఖ్యలు చేశాడు మహ్మద్ సిరాజ్.. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 9 ఓవర్లలో ఓ మెడియిన్‌తో 2 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్... 66 పరుగులు సమర్పించాడు... మొదటి ఓవర్ మినహా ఇస్తే మిగిలిన ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించాడు.. 

అయితే హార్ధిక్ పాండ్యా 4, యజ్వేంద్ర చాహాల్ 3 వికెట్లు తీయడంతో 259 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్. భారత జట్టు 5 వికెట్ల తేడాతో మూడో వన్డే గెలిచి, సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఐపీఎల్ 2021 సీజన్‌లో అదిరిపోయే ఎకానమీతో బౌలింగ్ చేసి అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచిన మహ్మద్ సిరాజ్, 2022 సీజన్‌లో ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు. సీజన్‌లో 30 సిక్సర్లు సమర్పించిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్న మహ్మద్ సిరాజ్, 10+ఎకానమీతో పరుగులు సమర్పించి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాడు...

ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్స్‌లో భాగంగా మహ్మద్ సిరాజ్‌ని రూ.7 కోట్లకు రిటైన్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో చూపించిన పర్ఫామెన్స్‌ని, ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో కొనసాగించలేకపోయాడు సిరాజ్...