Asianet News TeluguAsianet News Telugu

సెంచరీ బాదిన జానీ, ఫాలోఆన్ గండం తప్పించుకున్న ఇంగ్లాండ్... హ్యాట్రిక్ సెంచరీతో బెయిర్‌స్టో రికార్డు..

India vs England 5th Test: వరుసగా మూడో టెస్టులో సెంచరీ బాదిన జానీ బెయిర్‌స్టో... ఈ ఏడాదిలో జానీకి ఐదో టెస్టు సెంచరీ...  2022లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన ప్లేయర్‌గా జానీ బెయిర్‌స్టో...

India vs England 5th test: Johnny Bairstow creates some records with Century against Team India
Author
India, First Published Jul 3, 2022, 6:36 PM IST

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 84/5 వద్ద మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్‌కి జానీ బెయిర్‌స్టో, కెప్టెన్ బెన్ స్టోక్స్ కలిసి శుభారంభం అందించారు. ఆరో వికెట్‌కి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడు...

మహ్మద్ షమీ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను శార్దూల్ ఠాకూర్ జారవిడిచాడు. 18 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బెన్ స్టోక్స్, ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో షాట్‌కి ప్రయత్నించిన బెన్ స్టోక్స్, జస్ప్రిత్ బుమ్రా పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌ని పెవిలియన్ చేరాడు. అంతకుముందు బంతికే బుమ్రా క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన బెన్ స్టోక్స్, తర్వాతి బంతికి అదే షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

36 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ అవుటైన తర్వాత మరింత దూకుడు పెంచిన జానీ బెయిర్‌స్టో, వరుస బౌండరీలతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న జానీ బెయిర్‌స్టో, 119 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు...

మొదటి 64 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసిన జానీ బెయిర్‌స్టో, ఆ తర్వాత 54 బంతుల్లో 84 పరుగులు చేసి టీ20 మోడ్‌లో బ్యాటింగ్ చేయడం విశేషం.  ఈ ఏడాదిలో జానీ బెయిర్‌స్టోకి ఇది ఐదో సెంచరీ. ఐదు అంతకంటే కింద బ్యాటింగ్‌కి వస్తూ ఒకే ఏడాదిలో ఐదు టెస్టు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు జానీ బెయిర్‌స్టో...

ఇంతకుముందు 2012లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఐదు సెంచరీలు చేయగా 2022లో ఏడు నెలల్లోనే ఆ ఫీట్‌ని అందుకున్నాడు బెయిర్‌స్టో. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి రెండు టెస్టుల్లో సెంచరీలు చేసిన జానీ బెయిర్‌స్టో, వరుసగా మూడో టెస్టులో హ్యాట్రిక్ శతకాన్ని నమోదు చేశాడు... అంతకుముందు యాషెస్ సిరీస్‌లో ఓ సెంచరీ కొట్టిన జానీ బెయిర్‌స్టో, వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సెంచరీ బాదాడు. 

వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీలు చేసిన 15వ ఇంగ్లాండ్ క్రికెటర్‌గా నిలిచిన జానీ బెయిర్‌స్టో, 2016 జనవరి తర్వాత టీమిండియాపై అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. మరో ఎండ్‌లో సామ్ బిల్లింగ్స్ కూడా నిలదొక్కుకోవడంతో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ గండాన్ని తప్పించుకుంది...

తొలి రోజు 27 ఓవర్లలో 5 వికెట్లు తీసిన భారత బౌలర్లు, మూడో రోజు వికెట్లు తీయడానికి చెమటోడుస్తున్నారు. మూడో రోజు ఆటలో శార్దూల్ ఠాకూర్ మినహా మిగిలిన భారత బౌలర్లు ఎవ్వరూ ఇప్పటిదాకా వికెట్ తీయలేకపోయారు. జానీ బెయిర్‌స్టోని ఎంత త్వరగా అవుట్ చేసి, ఇంగ్లాండ్‌ని ఎంత తక్కువ స్కోరుకి ఆలౌట్ చేయగలిగితే భారత జట్టుకి ఈ టెస్టుపై పట్టు సాధించే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios