Asianet News TeluguAsianet News Telugu

ఏందిది! యువీనా లేక బుమ్రానా... జస్ప్రిత్ ఆటకు 2007 గుర్తుకు వచ్చిందన్న టెండూల్కర్...

టీ20ల్లో, టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించిన బౌలర్‌గా స్టువర్ట్ బ్రాడ్... అప్పుడు యువరాజ్ సింగ్, ఇప్పుడు జస్ప్రిత్ బుమ్రా కారణంగా..

India vs England 5th test: Jasprit Bumrah reminds Yuvraj Singh 2007 T20 World cup feat
Author
India, First Published Jul 2, 2022, 5:07 PM IST

కెప్టెన్సీ కొందరికి భారమైతే, మరికొందరికి కొత్త ఊపుని ఇస్తుంది. టీమిండియా నయా కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా ఈ కేటగిరిలోకే వస్తాడు. ఇన్నాళ్లు బౌలర్‌గానే అదరగొట్టిన జస్ప్రిత్ బుమ్రా, కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత బ్యాటుతోనూ దుమ్మురేపాడు. ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 35 పరుగులు రాబట్టి చరిత్ర లిఖించాడు...

స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో మొదటి బంతికి ఫోర్ బాదిన జస్ప్రిత్ బుమ్రా, ఆ తర్వాతి బంతికి సిక్సర్ బాదాడు. అంతకుముందు వైడ్స్‌గా 5 పరుగులు రావడం, రెండో బంతి నో బాల్‌గా తేలడంతో మొదటి అఫిషియల్ బంతి పూర్తి కాకముందే 16 పరుగులు వచ్చేశాయి... ఆ తర్వాత వరుసగా మూడు బంతుల్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత ఐదో బంతికి సిక్సర్ కొట్టాడు. జస్ప్రిత్ బుమ్రా మెరుపుల కారణంగా టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు క్రియేట్ చేశాడు స్టువర్ట్ బ్రాడ్...

2007 టీ20 వరల్డ్ కప్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు రాబట్టాడు యువరాజ్ సింగ్. టీ20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చి బౌలర్‌గా నిలిచిన స్టువర్ట్ బ్రాడ్, బుమ్రా కారణంగా టెస్టుల్లోనూ అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు..

టెస్టుల్లో అత్యధిక స్ట్రైయిక్ రేటుతో 30కి పైగా పరుగులు చేసిన మూడో కెప్టెన్‌గా నిలిచాడు జస్ప్రిత్ బుమ్రా. ఇంతకుముందు 2004లో స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ 281.81 స్ట్రైయిక్ రేటుతో 31 పరుగులు చేయగా 2010లో షాహిదీ ఆఫ్రిదీ 206.6 స్ట్రైయిక్ రేటుతో 31 పరుగులు చేశాడు. తాజాగా బుమ్రా 193.75 స్ట్రైయిక్ రేటుతో 16 బంతుల్లో 31 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు...

ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు రాబట్టిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. ఇంతకుముందు 2003లో రాబిన్ పీటర్సన్ బౌలింగ్‌లో విండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా 28 పరుగులు రాబట్టగా జస్ప్రిత్ బుమ్రా 35 పరుగులు స్కోరు చేసి సరికొత్త చరిత్ర లిఖించాడు. ఎక్స్‌ట్రా రూపంలో వచ్చిన 5 వైడ్లు, ఓ నోబాల్ తీసి వేసినా జస్ప్రిత్ బుమ్రా 29 పరుగులు చేసి బ్రియాన్ లారా రికార్డును అధిగమించాడు. 

జస్ప్రిత్ బుమ్రా మెరుపు ఇన్నింగ్స్‌పై సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘ఏందిది... యువీ నా బుమ్రా నా... 2007 గుర్తుకు వచ్చింది...’ అంటూ యువరాజ్ సింగ్, జస్ప్రిత్ బుమ్రాలను ట్యాగ్ చేశాడు సచిన్ టెండూల్కర్.. టీ20 వరల్డ్ కప్ 2007 టోర్నీలో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో సిక్సర్ల మోత మోగించిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంకా జస్ప్రిత్ బుమ్రా బ్యాటింగ్ ఫీట్ స్పందించలేదు.. 

Follow Us:
Download App:
  • android
  • ios