Asianet News TeluguAsianet News Telugu

ఐదో టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా... పంతం పట్టి, సిరీస్ సమం చేసిన ఇంగ్లాండ్...

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న ఇంగ్లాండ్... టీమిండియాకి ఘోర పరాభవం...

India vs England 5th Test: England beats Team India and equals test series
Author
India, First Published Jul 5, 2022, 4:36 PM IST

ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో టీమిండియా ఫ్యాన్స్ ఊహించిన మ్యాజిక్‌లు ఏం జరగలేదు. కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా కానీ, లార్డ్ శార్దూల్ ఠాకూర్, సిరాజ్ మియ్యా... ఎవ్వరూ ఐదో రోజు వికెట్ తీయలేకపోయారు. నాలుగో రోజు రెండు సెషన్ల పాటు టీమిండియాపై డామినేషన్ చూపించిన ఇంగ్లాండ్... ఐదో రోజు కూడా భారత బౌలర్లను ఓ ఆటాడుకుంటూ రికార్డు విజయం సాధించింది... 

377 పరుగుల రికార్డు లక్ష్యాన్ని 76.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఇంగ్లాండ్. 350+ పరుగుల లక్ష్యం పెట్టిన తర్వాత కూడా టీమిండియా టెస్టు మ్యాచ్ ఓడిపోవడం ఇదే మొదటిసారి...  1977లో ఆస్ట్రేలియా, 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టీమిండియాని ఓడించగా ఆ 55 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి ఘన విజయం అందుకుంది ఇంగ్లాండ్..

గత ఏడాది సెప్టెంబర్‌లో 2-1 తేడాతో ముగియాల్సిన టెస్టు సిరీస్‌లో కరోనా కారణంగా రద్దయిన ఐదో టెస్టును నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబట్టి, విజయం సాధించి సిరీస్‌ని 2-2 తేడాతో సమం చేసింది ఇంగ్లాండ్. కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లాండ్‌కి ఇది వరుసగా నాలుగో విజయం...

ఓవర్‌నైట్ స్కోరు 259/3 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్, వికెట్లేమీ కోల్పోకుండా మ్యాచ్‌ని ముగించింది... జో రూట్ 173 బంతుల్లో 19 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 142 పరుగులు చేయగా, జానీ బెయిర్‌స్టో 145 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 269 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.

టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టో కలిసి 200+ భాగస్వామ్యం నెలకొల్పి... భారత జట్టుకి విజయాన్ని దూరం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఈ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు... టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, 2019 నవంబర్‌లో టెస్టుల్లో 27వ సెంచరీ నమోదు చేయగా, ఆ సమయానికి 17 సెంచరీలతో ఉన్న జో రూట్... రెండున్నరేళ్లలో 11 సెంచరీలతో 28 సెంచరీలు నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ మాత్రం 27వ సెంచరీ దగ్గరే ఆగిపోయాడు...

 ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 27 సెంచరీలతో విరాట్ కోహ్లీతో సమంగా రెండో స్థానంలో ఉన్నాడు. 2021 జనవరిలో టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 27వ సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్, ఏడాదిన్నరగా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు... గత 24 టెస్టుల్లో 11 టెస్టు సెంచరీలు చేసిన జో రూట్... టీమిండియాపై 9వ టెస్టు సెంచరీ నమోదు చేసి రికీ  పాంటింగ్ రికార్డు బ్రేక్ చేశాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, విండీస్ లెజెండ్స్ వీవ్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, స్టీవ్ స్మిత్.. టీమిండియాపై 8 టెస్టు సెంచరీలతో జో రూట్ తర్వాతి స్థానంలో నిలిచారు...

ప్రస్తుత తరంలో 10వేలకు పైగా టెస్టు పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన జో రూట్, 28వ టెస్టు సెంచరీ అందుకున్న  ప్లేయర్‌గానూ నిలిచాడు. ఫ్యాబ్ 4లో నాలుగో స్థానంలో నిలిచిన జో రూట్, ఏడాదిన్నరలో టాప్‌లోకి దూసుకురావడం విశేషం...
 

Follow Us:
Download App:
  • android
  • ios