చెన్నై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశాలున్నాయి. అంపైర్ నితిన్ మీనన్ తో వాగ్వివాదానికి దిగడంతో ఆయనపై నిషేధం విధించే అవకాశం ఉంది. ఇంగ్లండుతో జరిగిన రెండో టెస్టు నాలుగో ఇన్నింగ్సులో అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆ సంఘటన చోటుచేసుకుంది. 

అక్షర్ పటేల్ వేసిన బంతి నేరుగా వికెట్లకు రావడంతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ దాన్ని ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, బంతి ఆయన ప్యాడ్ కు తగిలి వెనక్కి వెళ్లింది. దాన్ని పట్టుకున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ అవుట్ కు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ మీనన్ నాటౌట్ గా ప్రకటించాడు. 

దానిపై విరాట్ కోహ్లీ రివ్యూకు వెళ్లాడు. బంతి ప్యాడ్ కు తగిలినట్లు రివ్యూలో తేలింది. అది నేరుగా ప్యాడ్ కు తగలడంతో ఎల్బీడబ్ల్యూ కోణంలో కూడా పరిశీలించారు. అందులో బంతి వికెట్లను తాకుతున్నట్లు తేలింది. బంతి పిచ్ అయిన చోటు అంపైర్స్ కాల్ గా ఉండడంతో నాటౌట్ గా ప్రకటించారు. దాంతో కోహ్లీకి కోపం నషాళానికి అంటింది.అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్ సర్దిచెబుతున్నా వినకుండా వాదించాడు. 

కోహ్లీ చేసిన తప్పు లెవెల్ 1 లేదా లెవెల్ 2గా పరిగణించే అవకాశం ఉంది. ఇలాంటి తప్పులకు సంబంధిత ఆటగాడికి ఒకటి నుంచి నాలుగు డీమెరట్ పాయింట్స్ వస్తాయి. ఇప్పటికే కోహ్లీపై రెండు డీమెరిట్ పాయింట్స్ ఉన్నాయి. దీంతో మొత్తం డీమెరిట్ పాయింట్స్ కలిపితే ఓ టెస్టు మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది. కోహ్లీ గత 24 నెలలుగా 2 డీమెరిట్ పాయింట్స్ కలిగి ఉన్నాడు.

ఇదిలావుంటే, చైన్నైలో చేపాక్ మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ ఇంగ్లండుపై ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్ ను 1-1 స్కోరుతో సమం చేసింది.