Asianet News TeluguAsianet News Telugu

ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడ్డ మహ్మద్ షమీ! ఉమ్రాన్ మాలిక్‌కి ఛాన్స్... బంగ్లాతో టెస్టు సిరీస్‌కి కూడా...

ప్రాక్టీస్ సెషన్స్‌లో మహ్మద్ షమీ భుజానికి గాయం! షమీ ప్లేస్‌లో ఉమ్రాన్ మాలిక్‌కి వన్డే సిరీస్‌లో అవకాశం కల్పించిన సెలక్టర్లు... టెస్టు సిరీస్‌కి అనుమానంగా షమీ... 

India vs Bangladesh: Umran Malik has been named as Mohammed Shami replacement
Author
First Published Dec 3, 2022, 10:55 AM IST

టీమిండియాని గాయల బెడద వదలడం లేదు. ఇప్పటికే జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా గాయపడి జట్టుకి దూరం కావడంతో ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది భారత జట్టు. తాజాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకి మరో షాక్ తగిలింది.

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చింది టీమిండియా. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కోసం ఇప్పటికే ఢాకా చేరుకున్న మహ్మద్ షమీ, ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడ్డాడు...

షమీ భుజానికి గాయం కావడంతో కోలుకోవడానికి సమయం పడుతుందని తేల్చిన వైద్యులు, రెండు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్ మొత్తానికి దూరమైన మహ్మద్ షమీ, టెస్టు సిరీస్ సమయానికి అయినా కోలుకుంటాడా? అనేది అనుమానంగా మారింది....

గాయపడిన మహ్మద్ షమీ స్థానంలో జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కి అవకాశం కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ ద్వారా వన్డే ఆరంగ్రేటం చేసిన ఉమ్రాన్ మాలిక్, రెండు వన్డేల్లో 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు...

ఉమ్రాన్ మాలిక్‌తో పాటు మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్.. బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌కి ఫాస్ట్ బౌలర్లుగా వ్యవహరించబోతున్నారు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత పూర్తిగా టీ20 ఫార్మాట్‌కి దూరంగా ఉన్న మహ్మద్ షమీ... గత ఏడాది పూర్తిగా వన్డే, టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు...

అయితే గాయం కారణంగా జస్ప్రిత్ బుమ్రా, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరం కావడంతో అతని స్థానంలో మహ్మద్ షమీని ఆడించింది టీమిండియా. పొట్టి ప్రపంచకప్‌కి ముందు జరిగిన ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ఎంపికైన మహ్మద్ షమీ... మొదటి మ్యాచ్‌కి ముందు కరోనా బారిన పడ్డాడు. కరోనా నుంచి కోలుకోవడానికి చాలా సమయం తీసుకున్న మహ్మద్ షమీ... నేరుగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనే బరిలో దిగాడు...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత ఫాస్ట్ బౌలర్లు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. యంగ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, సీనియర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ కంటే మెరుగ్గా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి అర్ష్‌దీప్ సింగ్‌కి విశ్రాంతి కల్పించింది భారత జట్టు...

దీపక్ చాహార్ గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇవ్వడం టీమిండియాకి కలిసి వచ్చే విషయం. బంగ్లాదేశ్ జట్టును కూడా గాయాలు వెంటాడుతున్నాయి. వన్డే సిరీస్ ఆరంభానికి ముందు బంగ్లా వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో వన్డే సిరీస్‌కి లిటన్ దాస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. అలాగే బంగ్లా స్టార్ బౌలర్ టస్కిన్ అహ్మద్ గాయంతో వన్డే సిరీస్‌కి దూరమయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios