తొలి టెస్టుకి ముందు బంగ్లాదేశ్‌కి షాక్... టస్కిన్ అహ్మద్ అవుట్! ఆసుపత్రిలో షకీబ్ అల్ హసన్...
గాయంతో తొలి టెస్టుకి దూరమైన టస్కిన్ అహ్మద్... ఉమ్రాన్ మాలిక్ దెబ్బకు ఆసుపత్రి పాలైన షకీబ్ అల్ హసన్! టెస్టు మ్యాచ్ సమయానికి కోలుకోవడంపై అనుమానాలు..

టీమిండియాతో తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న బంగ్లాదేశ్‌కి ఊహించని షాక్ తగిలింది. టీమిండియాని వన్డే సిరీస్‌లో 2-1 ఓడించి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చిన బంగ్లాదేశ్... తొలి టెస్టులో స్టార్ ప్లేయర్లు లేకుండా బరిలో దిగుతోంది. బంగ్లా స్టార్ బౌలర్ టస్కిన్ అహ్మద్, గాయంతో తొలి టెస్టుకి దూరమయ్యాడు... బంగ్లా కెప్టెన్ షకీల్ అల్ హసన్, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు...
వన్డే సిరీస్‌లో భారత ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ వేసిన ఓ బంతి, షకీల్ అల్ హసన్ ఛాతికి బలంగా తాకింది. ఈ గాయం తర్వాత ఢాకాలో షకీబ్ అల్ హసన్‌కి స్కానింగ్ చేయించారు. అయితే ఈ పరీక్ష రిపోర్టులో షకీబ్ అల్ హసన్‌కి తగిలిన గాయం ప్రమాదకరమైనదేమీ కాదని తేలింది...
అయితే నొప్పి తగ్గకపోవడంతో మంగళవారం మరోసారి ఆసుపత్రిలో చేరాడు షకీబ్ అల్ హసన్. ఇప్పటికైతే షకీబ్ అల్ హసన్, తొలి టెస్టు ఆడతాడా? లేదా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు బంగ్లాదేశ్.
‘షకీబ్ అల్ హసన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. అయితే అతనికి ఛాతిలో నొప్పి వచ్చిన సమయంలో వెహికల్స్ అందుబాటులో లేకపోవడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించాం. షకీబ్ కాస్త ఇబ్బందిగా ఉందని మాత్రమే చెప్పాడు. చెకప్స్ తర్వాత అతను ఆడతాడా? లేదా? అనేది నిర్ణయిస్తాం.. ’ అంటూ చెప్పుకొచ్చాడు బంగ్లా హెడ్ కోచ్ రస్సెల్ డొమింగో...
కొన్ని రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్న టస్కిన్ అహ్మద్, తొలి రెండు వన్డేల్లో ఆడలేదు. మూడో వన్డేలో తుదిజట్టులోకి వచ్చిన టస్కిన్ అహ్మద్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. అతని గాయం తిరగబెట్టడంతో తొలి టెస్టులో టస్కిన్ అహ్మద్ ఆడబోవడం లేదని తెలియచేశాడు రస్సెల్ డొమింగో..
బంగ్లాదేశ్‌తో ఇంతవరకూ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోలేదు టీమిండియా. ఇప్పటిదాకా ఇరు జట్ల మధ్య 11 టెస్టులు జరగగా అందులో 9 మ్యాచుల్లో భారత జట్టు ఘన విజయాలు అందుకుంది. మిగిలిన రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్ ఫైనల్ చేరాలని ఆశపడుతున్న భారత జట్టు... బంగ్లాతో రెండు టెస్టుల్లోనూ గెలిచి తీరాల్సిందే...
భారత్‌పై ఒక్క టెస్టు డ్రా చేసుకున్నా, బంగ్లాదేశ్... టీమిండియా ఫైనల్ ఛాన్సులపై తీవ్రంగా దెబ్బకొట్టినట్టు అవుతుంది. వన్డే సిరీస్‌లో డామినేట్ చేసిన బంగ్లా, మూడో వన్డేలో 227 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తొలి రెండు వన్డేల్లో ఫెయిల్ అయిన విరాట్ కోహ్లీ సెంచరీతో రీఎంట్రీ ఘనంగా చాటుకోగా యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగి 210 పరుగులతో రికార్డులు క్రియేట్ చేశాడు...
మూడో వన్డే జరిగిన చిట్టోగాంలోనే డిసెంబర్ 14 బుధవారం ఉదయం 9:30 గంటలకు తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో జట్టుకి దూరం కావడంతో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో టెస్టు సిరీస్ ఆడనుంది టీమిండియా. ఇంతకుముందు సౌతాఫ్రికా టూర్‌లో రెండో టెస్టుకి కెప్టెన్సీ చేసిన కెఎల్ రాహుల్, విజయాన్ని అందుకోలేకపోయాడు.