న్యూజిలాండ్ పర్యటన నుంచి బంగ్లాదేశ్‌కి చేరుకున్న దీపక్ చాహార్... మలేషియా ఎయిర్‌లైన్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ట్వీట్! వెంటనే స్పందించిన ఎయిర్ లైన్స్... 

దీపక్ చాహార్... మనోడికి ఉన్న టాలెంట్‌కి ఎప్పుడో టీమిండియాకి స్టార్ పేసర్ కావాల్సింది. పవర్ ప్లేలో వికెట్లు తీయగల దీపక్ చాహార్, అవసరమైతే బ్యాటుతో భారీ షాట్లు కూడా ఆడగలడు. అయితే బ్యాడ్ లక్, గాయాలు... దీపక్ చాహార్‌ని వెంటాడుతూ అతన్ని జట్టుకి దూరం చేస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీతో పాటు 2022 వరల్డ్ కప్ ఆడే అవకాశాలను కూడా గాయాల కారణంగానే కోల్పోయాడు దీపక్ చాహార్...

జస్ప్రిత్ బుమ్రా గాయపడడంతో ఆ ప్లేస్‌ని భర్తీ చేయగల బౌలర్‌గా కనిపించాడు దీపక్ చాహార్. గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమైన దీపక్ చాహార్, కాస్త ఆలస్యమైనా ఆసియా కప్ 2022 సమయానికి కోలుకున్నట్టే కనిపించాడు. అయితే ప్రేయసి జయ భరద్వాజ్‌ని పెళ్లాడిన తర్వాత వెన్నునొప్పితో బాధపడుతున్న దీపక్ చాహార్... గాయం తిరగబెట్టడంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమయ్యాడు.

Scroll to load tweet…

తాజాగా బంగ్లాదేశ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌లో దీపక్ చాహార్‌కి చోటు దక్కింది. న్యూజిలాండ్ పర్యటనలో వన్డే సిరీస్‌లో పాల్గొన్న దీపక్ చాహార్... అటు నుంచి నేరుగా బంగ్లాదేశ్‌కి బయలుదేరాడు. అయితే మలేషియా ఎయిర్‌లైన్స్ కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను సోషల్ మీడియాలో పంచుకున్నాడు దీపక్ చాహార్..

‘మలేషియా ఎయిర్‌లైన్స్‌లో నాకు దారుణమైన అనుభవం మిగిలింది. ముందుగా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆఖరి నిమిషంలో ఫ్లైయిట్ మార్చేశారు. అందులోనూ బిజినెస్ క్లాస్‌లో ఫుడ్ కూడా ఇవ్వలేదు. పర్లేదులే అని బయటపడితే... ఇప్పుడు లగేజీ కోసం 24 గంటలు ఎదురుచూడాల్సి వస్తోంది. నాకు రేపు మ్యాచ్ ఉంది. ఇప్పుడు లగేజీ ఎప్పుడొస్తుందా... అని వెయిట్ చేస్తూ కూర్చోవాల్సి వచ్చింది...ఇదో చెత్త అనుభవం...’ అంటూ ట్వీట్ చేశాడు దీపక్ చాహార్...

టీమిండియా ఆల్‌రౌండర్ ట్వీట్‌కి మలేషియా ఎయిర్‌లైన్స్ స్పందించింది. ‘హాయ్...దీపక్ చాహార్. మీకు ఇబ్బంది కలిగినందుకు మేం చింతిస్తున్నాం. ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మేం అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. అయితే కొన్ని అనివార్య, వాతావరణ, సాంకేతిక కారణాల వల్ల ఫ్లైయిట్ ఆలస్యం కావడం క్యాన్సిల్ కావడం జరిగింది. మీకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నాం....’ అంటూ రాసుకొచ్చింది మలేషియా ఎయిర్‌లైన్స్...

బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా డిసెంబర్ 4న తొలి వన్డే ఆడనుంది టీమిండియా. ఈ వన్డే సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో జమ్మూ కశ్మీర్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కి బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌లో చోటు కల్పించింది టీమిండియా.. 

ఐపీఎల్ 2022 మెగా వేలంలో దీపక్ చాహార్‌ని రూ.14 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన దీపక్ చాహార్, నాలుగు నెలల పాటు క్రికెట్‌కి దూరమయ్యాడు.